ఇరాన్ పై యుద్దానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎలాంటి ప్రకటన చేస్తారో అని ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూసింది. అయితే ఆయన ప్రకటన చూసి అంతా ఆశ్చర్యపోయారు అనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఏ మాత్రం కొత్తదనం లేకుండా గత కొన్ని రోజులుగా చెపుతున్న మాటలనే మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పుకొచ్చారు. దీంతో మరో సారి క్రూడ్ ధరలకు రెక్కలు వచ్చాయి...పలు దేశాల స్టాక్ మార్కెట్ లు కుప్పకూలాయి. భారతీయ స్టాక్ మార్కెట్ లో కూడా అదే పరిస్థితి. ఇరాన్‌పై జరుగుతున్న సైనిక చర్యల్లో అమెరికా తన ప్రధాన లక్ష్యాలను విజయవంతంగా చేరుకుందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దాడులు కీలకమైన ఘట్టానికి చేరుకున్నాయని, అయితే శత్రువు పూర్తిగా బలహీనపడే వరకు దాడులు కొనసాగుతాయని చెప్పారు.భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
యుద్ధంతో ఇరాన్‌కు తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఇరాన్ కీలక నేతలను అంతం చేశామని, ఇరాన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ను పూర్తిగా ధ్వంసంచేశామని తెలిపారు. అమెరికా భద్రత కోసం ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అవసరమన్నారు. ఇరాన్ అణ్వయుధాలు తయారుచేయకుండా చేశామని, ఇరాన్‌లో అధికార మార్పిడి కూడా జరిగిందని ట్రంప్ చెప్పుకొచ్చారు.47 ఏళ్లుగా అమెరికా, ఇజ్రాయెల్ అంతం కావాలని ఇరాన్ కోరుకున్నదని చెప్పారు. అమెరికాను శక్తివంతమైన దేశంగా మారుస్తున్నామని, ఇరాన్ తాను చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు.తన పాలనలో ఎన్నో విజయాలను సాధించాం అని.. గత అధ్యక్షులు చేసిన తప్పులను సరిచేస్తున్నా అని ట్రంప్ తన ప్రసంగంలో ప్రకటించుకున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై అతిపెద్ద దాడి జరిగిందన్న ట్రంప్.. అది 45 వేల మంది పౌరుల మృతికి కారణమైందని వెల్లడించారు.
హర్మూజ్ జలసంధిని ఇరాన్ కోసమే వినియోగించుకోవచ్చని, హర్మూజ్ జలసంధి నుంచి అమెరికాకు ఎలాంటి చమురు అక్కర్లేదని కూడా ట్రంప్ స్పష్టం చేసారు. మా దేశంలోనే పుష్కలంగా చమురు నిక్షేపాలు ఉన్నాయి. సంక్షోభం ముగిశాక హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుంది. అతి త్వరలో యుద్ధం సమాప్తమవుతుంది అని ట్రంప్ ప్రకటించారు.ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని, ఇరాన్‌లో పాలకవర్గం మార్పునకు ఒత్తిడి తీసుకురాలేదని ట్రంప్ తెలిపారు. అమెరికన్ల భవిష్యత్ కోసమే ఈ యుద్ధం చేస్తున్నామని ట్రంప్ వెల్లడించారు. 2-3 వారాల్లో భీకరదాడులు చేస్తామని, యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
ఈ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలు నష్టపోకుండా కూడా చర్యలు తీసుకుంటామని, సౌదీ, కువైట్, బహ్రెయిన్‌కు భద్రత కల్పిస్తామని ట్రంప్ వెల్లడించారు. అమెరికా పిల్లల భవిష్యత్ భద్రంగా ఉండటానికే ఈ చర్యలు చేపట్టామని, అమెరికా ఆర్థికవ్యవస్థ పటిష్ఠంగా ఉందని ట్రంప్ వెల్లడించారు. అమెరికాలో ఇంధన సమస్య తాత్కాలికమేనని ట్రంప్ చెప్పారు. ఇరాన్‌కు క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించే సామర్థ్యం తగ్గిపోయిందని.. ఇరాన్‌ను రాతియుగానికి నెట్టేస్తామని, అవసరమైతే ఇరాన్ చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని కూడా ప్రకటించారు.ఇరాన్ రాజీకి రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ట్రంప్ తన ప్రసంగంలో హెచ్చరించారు.