ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం పూర్తిగా ముగిసిపోయింది అని ప్రపంచం అంతా ఊపిరి పీల్చుకుంటున్న వేళ అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ లో ఈ రెండు దేశాలు మళ్ళీ యుద్దానికి దిగే అవకాశాలు లేకపోలేదు అని చెప్పారు. కాకపోతే ప్రస్తుతం ఇవి రెండూ అలసి పోయాయి అని పేర్కొన్నారు. ఏదో ఒక రోజు ఈ రెండు దేశాలు మళ్ళీ యుద్ధం మొదలుపెట్టొచ్చు అని...అది త్వలోనే ఉండే అవకాశం ఉంది అంటూ కీలక వ్యాఖ్యలు చేయటం ఇప్పడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇజ్రాయిల్, ఇరాన్ దేశాలతో తాను ఇప్పటికే మాట్లాడాను అని చెప్పుకొచ్చారు. మరో వైపు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై విధించిన ఆంక్షలు సడలించే అవకాశం ఉంది అనే సంకేతాలు ఇచ్చారు. ఇరాన్ పై అమెరికా దాడులు చేయటం వల్లే పశ్చిమాసియాలో యుద్ధం త్వరగా ముగిసింది అన్నారు.
తన నిర్ణయంతో అందరికి విజయం లభించినట్లు అయింది అని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇరాన్ పునర్నిర్మాణానికి పెద్ద ఎత్తున ఇప్పుడు వనరులు అవసరం అని...అందులో భాగంగా ఆ దేశం కోలుకోవటం కోసం కొన్ని ఆంక్షలను సడలించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షలు తొలగించే అవకాశం ఉంది అని చెపుతున్నారు. మరో వైపు ఇరాన్ తో అణు చర్చల అంశాన్ని డోనాల్డ్ ట్రంప్ మరో సారి ప్రస్తావించారు. అణ్వాయుధాలు తయారు చేయాలి అనే ఇరాన్ ఆశయం వదిలేసేలా ఆ దేశంతో వచ్చే వారం టెహ్రాన్ లో చర్చలు జరపనున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఒప్పందం జరిగే అవకాశం ఉంది అన్నారు.