భారత్ బంద్ కు పెద్ద ఎత్తున మద్దతు

Update: 2020-12-07 16:05 GMT

తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ కూడా

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. మంగళవారం నాడు రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు అనూహ్య స్పందన వస్తోంది. పలు వర్గాలు రైతుల బంద్ కు మద్దతు పలుకుతున్నాయి. దేశంలోని 25 కుపైగా రాజకీయ పార్టీలు ఇప్పటికే భారత్ బంద్ కు మద్దతు ప్రకటించాయి. రైతులు దేశ రాజధాని సరిహద్దుల్లో రోడ్లపై ఉంటూ గత కొన్ని రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. పలు దఫాలు కేంద్రంతో చర్చలు జరిగినా కూడా ఫలితం తేలలేదు. భారత్ బంద్ మరుసటి రోజు అంటే డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వంతో మరోమారు చర్చలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రైతు చట్టాల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గే సూచనలు ఉన్నట్లు కన్పించటం లేదు.

కొన్ని మార్పులు చేయటానికి సిద్ధంగా ఉన్నా..రైతులు కోరతున్నట్లు చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకునే వాతావరణం కన్పించటంలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సంస్కరణలు అనివార్యం అంటూ తాజాగా ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు కేంద్రం చట్టాల విషయంలో ఎలా వ్యవహరించనుందో చెప్పకనే చెబుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ స్వయంగా బంద్ కు నేతృత్వం వహిస్తోంది. ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ధర్నాలు, రాస్తారోకోల్లో పాల్గొనున్నారు. ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ పార్టీ ఇలా రోడ్డెక్కటం ఇదే మొదటిసారి. అందుకే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తీరును తప్పుపడుతోంది. నిన్న మొన్నటివరకూ ఏ సమస్యపై స్పందించినా హౌస్ అరెస్ట్ లు చేసిన టీఆర్ఎస్ సర్కారు..రేపు ఆ పార్టీ నాయకులను కూడా అదే విధంగా అరెస్ట్ చేస్తుందా అని ప్రశ్నించింది.

తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్ రైతు బంద్ లో పాల్గొననుంది. ఏపీలో అనూహ్యంగా వైసీపీ సర్కారు కూడా బంద్ కు సంఘీభావం ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నాం వరకూ కార్యాలయాలు బంద్ పెట్టడంతోపాటు..ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రైతు చట్టాలపై ఇంత కాలం మౌనంగా ఉన్న వైసీపీ పరిస్థితిని చూసి తన వైఖరిని మార్చుకున్నట్లు కన్పిస్తోంది. తెలుగుదేశం పార్టీ అయితే వినతిపత్రాలు అంటూ కొత్త రాగం అందుకుంది. ఏపీలో అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీలు రెండూ అటు కేంద్రంపై, మోడీపై గట్టిగా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నాయి. గిట్టుబాటు ధర కు ఢోకా ఉండదని చెప్పాకే వ్యవసాయ బిల్లులకు మద్దతు ఇఛ్చామని చెబుతున్న మంత్రి కన్నబాబు ఏపీకి సంబంధించిన అంశాలను చట్టాల్లో ఉన్నా కేంద్రం అమలు చేయని విషయాన్ని చాలా కన్వీనెంట్ గా మర్చిపోతున్నారు.

Tags:    

Similar News