ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాల్లో దిగ్గజ ఐటి సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) మంచి బోణి కొట్టింది అనే చెప్పాలి. ఈ సీజన్ లో ఫలితాల ప్రకటన గురువారం టిసిఎస్ తోనే మొదలు అయింది. 2025 ఏప్రిల్-జూన్ తో ముగిసిన తొలి మూడు నెలలలో కాలంలో కంపెనీ 12760 కోట్ల రూపాయల నికర లాభం ప్రకటించింది. మార్కెట్ అంచనాలను అధిగమించి మరీ టిసిఎస్ మెరుగైన ఫలితాలు వెల్లడించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే నికర లాభంలో ఆరు శాతం మేర వృద్ధి నమోదు అయింది.
గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఆదాయం 1 . 3 శాతం పెరిగి 62613 కోట్ల రూపాయల నుంచి 63437 కోట్ల రూపాయలకు పెరిగింది. కంపెనీ తొలి మూడు నెలల కాలానికి ఒక్కో షేర్ పై పదకొండు రూపాయల డివిడెండ్ ప్రకటించింది. దీనికి జులై 16 వ తేదీని రికార్డు డేట్ గా నిర్ణయించారు. ఈ మూడు నెలల కాలంలో కంపెనీ కొత్తగా 5452 మంది ఉద్యోగులను తీసుకుంది. దీంతోటి ప్రస్తుతం కంపెనీ పని చేస్తున్న ఐటి ఉద్యోగుల సంఖ్య 6 .13 లక్షలకు చేరింది.