అమెరికా అండ లేకుండా ఆ ప్రకటన చేయగలడా!

Update: 2025-08-11 06:48 GMT

ఒక వైపు సుంకాల బాదుడు. మరో వైపు ఇండియా బద్దశత్రువు పాకిస్థాన్ తో కలిసి కవ్వింపులు?. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ అండలేకుండా ఆ దేశ గడ్డ మీద నుంచి ఇండియాపై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇష్టానుసారం ప్రేలాపనలు చేయగలరా?అంటే ఖచ్చితంగా నో అనే చెప్పొచ్చు. సింధూ నదిపై భారత్ డ్యామ్ లు నిర్మిస్తే ..అవి పూర్తి అయ్యే వరకు ఆగి వాటిని తమ క్షిపణులతో పేల్చేస్తాం అంటూ మాట్లాడాడు మునీర్. ఒక వేళ న్యూ ఢిల్లీ నుంచి తమ అస్తిత్వానికి ముప్పు ఏర్పడితే మాత్రం తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం అని...తమది అణ్వాయుధాలు కలిగిన దేశం అని హెచ్చరించారు. ఆపరేషన్స్ సిందూర్ దెబ్బకు యుద్ధం ఆపేద్దాం అని ప్రాధేయపడిన పాకిస్థాన్ ఇప్పుడు ఇంతగా రెచ్చిపోతుంది అంటే ఇది ఖచ్చితంగా అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ అండ చూసుకునే అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

                                          ఆపరేషన్ సిందూర్ తర్వాత రెండు నెలల వ్యవధిలో మునీర్ అమెరికా లో పర్యటించటం ఇది రెండవ సారి. తొలిసారి ఆయన వైట్ హౌస్ లో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తో కలిసి డిన్నర్ చేశారు. సుంకాల విషయంలో తాను చెప్పినట్లు ఇండియా ఒప్పుకోకపోవడంతో డోనాల్డ్ ట్రంప్ రగిలిపోతున్నారు. అందుకే రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు అని చెప్పి మొత్తం ఇండియా పై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అయినా కూడా ఇండియా తాము ఇలాంటి ఒత్తిళ్లకు తలొగ్గము అని తేల్చిచెప్పటం ఇప్పుడు ట్రంప్ ను మరింత ఇరకాటంలోకి నెట్టింది. మరో వైపు ట్రంప్ నిర్ణయాలు అమెరికా నే తీవ్ర సంక్షోభంలోకి నెట్టే అవకాశం ఉంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో పాక్ తో కలిసి ఇండియాను కవ్వించటం తో పాటు అనిశ్చిత వాతావరణం సృష్టించే పనిలో డోనాల్డ్ ట్రంప్ ఉన్నట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయో చూడాలి. అమెరికా నుంచి ఒక దేశాన్ని మరో దేశం అణు హెచ్చరికలు చేయటం ఇదే మొదటి సారి అని చెపుతున్నారు.

Tags:    

Similar News