విమాన ప్రయాణికులే కాదు..విమాన సిబ్బంది కూడా అప్పుడప్పుడు వివాదాల్లో చిక్కుకుంటారు. అలాంటిదే ఈ ఘటన. స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన సిబ్బంది చేసిన పని ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఈ ఎయిర్ లైన్స్ లోని ఒక ఎయిర్ హోస్టెస్, క్యాబిన్ చీఫ్ లు విమానం రెక్కలపై నిలుచుని రకరకాల ఫోజ్ లతో సెల్ఫీ లు దిగారు. అర్జెంటీనాలో వీళ్ళు బోయింగ్ 777 విమానం రెక్కలపై నిలబడి ఈ పని చేశారు. మొత్తం ముగ్గురు ఇలా ఫోటో లు దిగినట్లు గుర్తించారు. విమాన సిబ్బంది అయినా సరే అత్యవసర సమయాల్లో తప్ప రెక్కలపైకి వెళ్ళటానికి అనుమతి ఉండదు.
కానీ సెల్ఫీ ల కోసం, డాన్స్ చేస్తూ విమానం రెక్కలపై సిబ్బంది కనిపిస్తున్న ఫోటో లు వైరల్ గా మారాయి. స్విస్ ఎయిర్ లైన్స్ వీరిపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. వీళ్ళు చేసిన పని విధ్వంసకరమైనది అని..ఇలాంటి వాటిని ఉపేక్షించబోమని ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. బోయింగ్ 777 విమానం రెక్కలు 16 .4 అడుగులు ఎత్తులో ఉంటాయని..అంత ఎత్తు నుంచి గట్టి నేలపై పడితే ప్రమాదం అని తెలిపారు . అయితే సిబ్బంది విమానం రెక్కలపై నిలుచుని ఫోటో లు దిగిన సమయంలో లోపల ప్రయాణికులు ఎవరూ లేరు అని..అయినా సిబ్బంది భద్రతా నిబంధనలు ఉల్లఘించారు అని తెలిపారు.