సుదీర్ఘ వాదనల అనంతరం సుప్రీంకోర్టు మారటోరియానికి సంబంధించి తీర్పు వెలువరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) ప్రకటించిన ఆరు నెలల రుణ మారటోరియంను పొడిగించాలని కోరుతూ వివిధ వాణిజ్య సంఘాలు, కార్పొరేట్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మంగళవారం తన తీర్పును వెలువరించింది. మారిటోరియం కాలంలో వడ్డీని పూర్తిగా మాఫీ చేయలేమని ఆర్ బిఐ పేర్కొంది. అలాగే దురుద్దేశపూరితంగా లేదా ఏకపక్షంగా ఉంటే తప్ప కేంద్రం ఆర్థిక నిర్ణయాలను న్యాయ సమీక్ష చేయలేమని వెల్లడించింది. ప్రత్యేక ఆర్థిక ఉపశమనం లేదా ప్యాకేజీలను ప్రకటించమని ప్రభుత్వాన్ని లేదా కేంద్ర బ్యాంకును ఆదేశించలేమని, ప్రత్యేక రంగాలకు ఉపశమనం అడగలేమని కూడా సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. చక్రవడ్డీ వసూలును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్, సుభాష్ రెడ్డి, ఆర్ షాలతో కూడిన అత్యున్నత ధర్మాసనం ఈ ఆదేశాల్చింది. ఆరు నెలల కాలానికి రుణ గ్రహీతలనుంచి చక్రవడ్డీ వసూలు చేయొద్దని తెలిపింది.
మారటోరియం కాలాన్ని పొడిగించడం, మొత్తం వడ్డీ మాఫీ సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఖాతాదారులకు, పెన్షనర్లకు బ్యాంకులు వడ్డీ చెల్లిస్తాయి, మరి అలాంటప్పుడు బ్యాంకులు రుణాలపై పూర్తిగా వడ్డీని ఎలా మాఫీ చేయగలవని సుప్రీం ప్రశ్నించింది. గతేడాది భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) విధించిన మారటోరియం 2020 ఆగస్టుతో ముగిసింది. రుణాలపై వడ్డీ వసూళ్ల మీద మారటోరియం పొడిగించడానికి కేంద్ర ఆర్ధికశాఖ, ఆర్ బిఐ నిరాకరించాయి. ఇప్పటికే రూ.2 కోట్ల వరకు రుణాలపై కేంద్రం వడ్డీ మాఫీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ సమయంలో ఆర్ధిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ మారిటోరియాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.