ఆక్సిజన్ సరఫరాకు సుప్రీం టాస్క్ ఫోర్స్

Update: 2021-05-08 14:46 GMT

కరోనా రెండవ దశ కల్లోలంతో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కు తీవ్ర కొరత ఏర్పడింది. దీనిపై కేంద్రంపై సుప్రీంకోర్టుతోపాటు పలు రాష్ట్రాల హైకోర్టులు కూడా తీవ్రంగా మండిపడ్డాయి. పలు రాష్ట్రాల్లొ కేవలం ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో కరోనా రోగులు ప్రాణాలు వదిలారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలాంటి హృదయవిదారక సంఘటనలు ఎన్నో జరిగాయి. ఒక్క ఢిల్లీలోనే కాకుండా పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. దీంతో అటు కేంద్రంతోపాటు పలు రాష్ట్రాలు ఆక్సిజన్ ను సమకూర్చుకోవటంపై ఫోకస్ పెట్టాయి. ఈ విషయంలో కోర్టులు కూడా జోక్యం చేసుకుని పలు ఆదేశాలు జారీ చేశాయి. తాజాగా సుప్రీంకోర్టు దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 12 మంది సభ్యులతో ఈ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తూ నిర్ణయం వెలువరించింది.

వెస్ట్‌ బెంగాల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ భబతోష్‌ బిశ్వాస్‌ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. ఇందులో గుర్గావ్‌ మేదాంత హాస్పిటల్‌ అండ్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఛైర్‌ పర్సన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా.నరేష్‌ ట్రెహన్‌ ఇందులో సభ్యులుగా ఉన్నారు. టాస్క్‌ ఫోర్స్‌లోని 12 మందిలో వైద్య నిపుణులు, డాక్టర్లు ప్రభుత్వం నుంచి ఇద్దరు వ్యక్తులు భాగం కానున్నారు. కేబినెట్ సెక్రటరీ టాస్క్‌ ఫోర్స్‌ కన్వీనర్‌గా ఉంటారు. ఈ బృందం వ్యాక్సిన్‌, ఆక్సిజన్‌ పంపిణీని పర్యవేక్షించనుంది. అంతేకాకుండా కరోనా చికిత్స కోసం అవసరమైన ఔషధాల అందుబాటును, మహమ్మారి కారణంగా ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారాలను అందిస్తుంది. ఓ వారం రోజుల్లోగా టాస్క్‌ ఫోర్స్‌ బృందం సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Tags:    

Similar News