గత కొన్ని రోజులుగా వరసగా భారీ నష్టాలు చవిచూస్తున్న స్టాక్ మార్కెట్లు తిరిగి గాడినపడినట్లేనా?. మంగళవారం నాడు మంచి లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు బుధవారం నాడు కూడా లాభాలతోనే మొదలు అయ్యాయి. ఎవరూ ఊహించని రీతిలో హర్యానా ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయం దక్కించుకోవటం మార్కెట్ సెంటిమెంట్ ను మెరుగుపర్చింది. మోడీ హవా కు ఢోకా లేదు అన్న సంకేతాలు మార్కెట్ పై ప్రభావం చూపించాయి. దీనికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాను అనుకున్న పనులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతుంది అని బావించటమే. దీనికి తోడు చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేట్ మందగించే అవకాశం ఉంది అంటూ ప్రపంచ బ్యాంకు వెల్లడించిన నివేదిక కూడా మార్కెట్లకు కలిసివచ్చింది.
వాస్తవానికి రెండవ త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభం అయ్యే లోగా మార్కెట్ లో ఇంకొంత కరెక్షన్ వస్తుంది అని ఎక్కువ మంది భావించారు. కానీ వాళ్ళ అంచనాలకు భిన్నంగా హర్యానా ఎన్నికల ఫలితాలు మార్కెట్ల దిశను మార్చాయని చెప్పొచ్చు. బుధవారం ఉదయం పది గంటల సమయంలో బిఎస్ఈ సెన్సెక్స్ 166 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 69 పాయింట్ల లాభంతో 25081 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. బుధవారం నాడు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుండయ్ మోటార్ తన ఐపీఓ వివరాలు వెల్లడించనుంది. దేశంలో ఇది అతి పెద్ద ఐపీఓ గా నిలవనున్న విషయం తెలిసిందే.హ్యుండయ్ ఒక్క షేర్ ధర 1865 రూపాయల నుంచి 1960 రూపాయల మధ్య ఉండే అవకాశం ఉంది అని వార్తలు వచ్చాయి. ఈ కంపెనీ మార్కెట్ నుంచి 25000 కోట్ల రూపాయలు సమీకరించే అవకాశం ఉంది.