దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో సాగుతున్నాయి. సోమవారం నాడు మార్కెట్ ప్రారంభం నుంచి ఊగిసలాట ధోరణే కొనసాగింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుకు అనుగుణంగా భారత్ లోనూ వడ్డీ రేట్లు పెరిగే ఛాన్స్ ఉందనే అంచనాల మధ్య మదుపరులు అమ్మకాలకు దిగారు. దీంతో పలు రంగాలకు చెందిన షేర్లు నష్టాల బాట పట్టాయి. దేశంలో వడ్దీ రేట్లు పెరిగితే ఈ ప్రభావం కార్పొరేట్ కంపెనీల లాభాలపై పడుతుందనే విషయం తెలిసిందే.
సోమవారం మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 700 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. వడ్డీ రేట్ల భయంతోపాటు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతుండంటతో ఇప్పటికే అధికంగా ఉన్న ద్రవ్యోల్భణం మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు పరిస్థితులను మదింపు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు.