ఈ ర్యాలీ కొనసాగుతుందా!

Update: 2025-03-24 11:08 GMT
ఈ ర్యాలీ కొనసాగుతుందా!
  • whatsapp icon

దేశీయ స్టాక్ మార్కెట్ లు తిరిగి బుల్ రన్ లోకి వచ్చినట్లేనా?. కరెక్షన్ కథ ముగిసింది అని ఒక్క నిర్ణయానికి రావొచ్చా!. ఇవే ఇప్పుడు ఇన్వెస్టర్లను వేధిస్తున్న ప్రశ్నలు. గత కొన్ని నెలలు మదుపరులకు చుక్కలు చూపించిన స్టాక్ మార్కెట్ గత వారం రోజుల నుంచి దూసుకెళుతోంది. అటు సెన్సెక్స్..ఇటు నిఫ్టీలు లాభాలతో పరుగులు పెడుతున్నాయి. అయితే ఇప్పుడు మార్కెట్ లో వస్తున్న ర్యాలీ ఎక్కువ కాలం నిలుస్తుందా లేదా అన్న టెన్షన్ ఎక్కువ మంది ఇన్వెస్టర్లలో ఉంది. ముఖ్యంగా మరో వారం రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ -మే నెలల్లో ప్రధాన కంపెనీలు అంటే మార్కెట్ దశ-దిశ నిర్ణయించే కంపెనీల ఆర్థిక ఫలితాలు అన్ని వచ్చేస్తాయి. ఆ తర్వాత మాత్రమే మార్కెట్ లో మరింత స్థిరత్వం వస్తుంది అని మార్కెట్ నిపుణుల అభిప్రాయం. దీంతో పాటు ఆర్థిక ఫలితాల తర్వాత మరో సారి కరెక్షన్ ఉంటుంది అని...ప్రతి కరెక్షన్ లోనూ ఫండమెంటల్స్ పరంగా పటిష్టంగా ఉన్న కంపెనీలను కొనుగోలు చేస్తే...ఈ సంవత్సరాంతం నాటికి మంచి రిటర్న్స్ ఉండే అవకాశం ఉంది అని చెపుతున్నారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన జనవరి నెల నుంచి మార్కెట్ లు వరసగా కుప్పకూలుతూ వచ్చాయి.

                                ముఖ్యంగా ట్రంప్ సుంకాల విషయంలో చేసిన ప్రకటనలు ఒక్క ఇండియా లోనే కాకుండా..ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ లపై తీవ్ర ప్రభావం చూపించాయి. చివరకు అమెరికా మార్కెట్ లు కూడా తీవ్ర నష్టాల బారిన పడిన సంగతి తెలిసిందే. డాలర్ తో రూపాయి మారకపు విలువ కూడా గత కొన్ని నెలలుగా పతనం అవుతూ వచ్చింది. మార్కెట్ ల తరహాలోనే ఇప్పుడు రూపాయి కూడా కోలుకొంటోంది. సోమవారం నాడు సెన్సెక్స్ ఏకంగా 1079 పాయింట్ల లాభంతో 77,984 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 308 పాయింట్ల లాభంతో 23658 వద్ద క్లోజ్ అయింది. సోమవారం మార్కెట్ ప్రారంభం అయినప్పటి నుంచి క్లోజింగ్ వరకు మార్కెట్ లో కొనుగోళ్ల దూకుడే కనిపించింది. పలు కీలక షేర్ల ధరలు ఇటీవల పతనం కావటంతో పలు స్టాక్స్ కు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది.

Tags:    

Similar News