స్టాక్ మార్కెట్ లు సోమవారం ఉదయం నుంచి...ముగిసేవరకు నష్టాల్లోనే కొనసాగాయి. బిఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1272 పాయింట్లు నష్టపోయింది. ఎన్ ఎస్ఈ నిఫ్టీ 368 పాయింట్ల నష్టంతో 25810 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ దెబ్బకు ఒక్క రోజులోనే ఏకంగా మూడున్నర లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం అయింది. సెన్సెక్స్ లో కీలక షేర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ 99 రూపాయల నష్టంతో 2953 వద్ద ముగిసింది. హెచ్ డీఎఫ్ సి బ్యాంకు 21 రూపాయల నష్టంతో 1732 రూపాయల వద్ద క్లోజ్ అయింది. మార్కెట్ ఏకంగా వెయ్యి పాయింట్ల మేర నష్టపోయినా కూడా ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ టిపీసి షేర్ మాత్రం లాభాలతోనే ముగిసింది. గత కొన్ని రోజులుగా ఈ షేర్ కు ఇన్వెస్టర్ల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. సోమవారం నాడు ఎన్ టిపీసి షేర్ ఐదు రూపాయలకు పైగా లాభంతో 443 రూపాయల వద్ద ముగిసింది.
సోమవారం నాడే 52 వారాల గరిష్ట స్థాయి 448 రూపాయలకు చేరింది. మార్కెట్ ల పతనానికి చైనా తీసుకున్న నిర్ణయాలు కూడా కారణం అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత కొంత కాలంగా చైనా ఆర్థిక ప్రగతి మందగించినట్లు వార్తలు వస్తున్నాయి. దీన్ని గాడిన పెట్టేందుకు అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో విదేశీ ఇన్వెస్టర్లు అటు వైపు ఫోకస్ పెట్టారు అని..ఇది కూడా భారతీయ మార్కెట్లపై ప్రాభవం చూపించింది అని చెపుతున్నారు. దీనికి తోడు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా సెంటిమెంట్ పై ప్రభావం చూపించాయి.