పీకల్లోతు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ఈ సమస్యను నుంచి గట్టెక్కేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగానే ఆ దేశ ఎయిర్ లైన్స్ అయిన శ్రీలంక ఎయిర్ లైన్స్ అమ్మకానికి పెట్టాలని పతిపాదించింది. ఈ అమ్మకం ద్వారా వచ్చే డబ్బులను అప్పులు తీర్చేందుకు వాడాలని ప్రతిపాదించారు. ఈ అంశాన్ని కొత్తగా నియమితుడైన ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తెలిపారు. శ్రీలంక ఎయిర్ లైన్స్ ను ప్రైవేట్ పరం చేయనున్నట్లు ఆయన తెలిపారు. భారీ ఎత్తున సంస్కరణలు చేపట్టి దేశ అప్పులను తీర్చాలని యోచిస్తున్నారు. శ్రీలంక ఎయిర్ లైన్స్ కూడా భారీ నష్టాల్లో ఉంది. పేదల్లో అత్యంత పేదలు అయిన వారి డబ్బును ఎయిర్ లైన్స్ కోసం ఖర్చు పెట్టడం ఏ మాత్రం సరికాదని..వారు కనీసం ఒక్కసారిగా ఈ ఎయిర్ లైన్స్ విమానాల్లోకి ఎక్కి ఉండరని వ్యాఖ్యానించారు.
2021 మార్చితో ముగిసిన కాలానికి శ్రీలంక ఎయిర్ లైన్స్ 124 మిలియన్ అమెరికన్ డాలర్ల నష్టాల్లో ఉంది. శ్రీలంక ప్రస్తుత సమస్యను అధిగమించేందుకు భారత్ తోపాటు చైనా తదితర దేశాల నుంచి భారీ ఎత్తున సాయం పొందుతోంది. రాబోయే రోజుల్లో ఆర్ధిక సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చనుందని రణిల్ విక్రమ్ సింఘే వెల్లడించారు. ఇప్పటికే పలు విదేశీ రుణాల చెల్లింపు విషయంలో శ్రీలంక డిఫాల్ట్ అయింది. ఈ సమస్యలన్నింటిని అధిగమించి సాధారణ స్థితికి చేరుకోవటానికి చాలా సమయం పడుతుందని భావిస్తున్నారు. ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక తమ దేశ ఎయిర్ లైన్స్ ను అమ్మాలని ప్రతిపాదించింది. భారత్ కూడా భారీ ఎత్తున అప్పుల్లో కూరుకుపోయిన ఇండియన్ ఎయిర్ లైన్స్ సుదీర్ఘ కసరత్తుల తర్వాత అమ్మేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ రంగంలోని ఎయిర్ లైన్స్ అన్నీ కూడా ఇంచుమించు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వాలుఎయిర్ లైన్స్ నడపటం అంటే అంత సులభమైన విషయం కాదనే అబిప్రాయం వ్యక్తం అవుతోంది.