స్పైస్ జెట్ విమానం ఒకటి పెద్ద ప్రమాదం నుంచి బయట పడింది. కలకత్తా నుంచి బ్యాంకాక్ కు బయలు దేరిన విమానం కొద్ది నిమిషాల వ్యవధిలోనే తిరిగి అదే విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. టేక్ ఆఫ్ అయిన కొద్ది సేపటికే లెఫ్ట్ ఇంజన్ లో వైబ్రేషన్స్ వస్తున్న అలెర్ట్ పైలట్ కు రావటం తో తెల్లవారుజామున 1 .11 గంటలకు అత్యవసర పరిస్థితి ప్రకటించి విమానం ల్యాండ్ చేశారు. దీనికి ముందు విమానాశ్రయంలో క్రాష్ ఫైర్ టెండర్స్, అంబులెన్సు లు, డాక్టర్లు, సిఐఎస్ఎఫ్ సిబ్బంది అందరు సిద్ధంగా ఉన్నారు.
విమానం సురక్షితంగా ల్యాండ్ అవటం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ బోయింగ్ బి 737 విమానంలో మొత్తం 178 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వీరిని తిరిగి మరో విమానంలో బ్యాంకాక్ పంపారు. తర్వాత ఇంజినీర్లు దీన్ని పరిశీలించి బ్లేడ్ లు దెబ్బతినటం తో ఇంజన్ ను ఆపేసారు. అదే విమానాశ్రయంలో కేవలం 12 గంటల వ్యవధిలో రెండు విమానాలు అత్యవసర లాండింగ్ కావటం కలకలం రేపింది. అంతకు ముందు ఇండిగో విమానం ఒకటి కూడా ఎమర్జెన్సీ లాండింగ్ అయింది.