డీజీసీఏ ప్రత్యేక నిఘా..ఉద్యోగులకు సెలవులు

Update: 2024-08-30 13:18 GMT

Full Viewదేశంలోని ప్రముఖ చౌక ధరల ఎయిర్ లైన్స్ స్పైస్ జెట్ సంక్షోభంలో కూరుకుపోతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఎయిర్ లైన్స్ తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఎయిర్ లైన్స్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. దేశంలోని విమానయాన నియంత్రణా సంస్థ అయిన డైరెక్టర్ జనరల్ అఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పైస్ జెట్ పై నిఘా..పర్యవేక్షణను మరింత పెంచాలని నిర్ణయించింది. దీనికి ప్రధాన కారణం ఆర్థిక కష్టాల్లో ఉన్న ఈ ఎయిర్ లైన్స్ ఇంజనీరింగ్ విభాగాల్లో కొన్ని లోపాలను గుర్తించినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఈ నెలలోనే నిర్వహించిన స్పెషల్ ఆడిట్ లో ఈ విషయం గుర్తించారు. ఆర్థిక సమస్యల కారణంగా ఈ ఎయిర్ లైన్స్ పలు విమాన సర్వీసులను కూడా నిత్యం రద్దు చేస్తోంది. డీజీసీఏ ఆదేశాలు ఇలా ఉంటే స్పైస్ జెట్ ఏకంగా 150 మంది విమాన కేబిన్ సిబ్బందిని సెలవుపై పంపించింది. వీళ్లకు ఎలాంటి వేతనాలు ఉండవు అని..తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పైస్ జెట్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

                                                  మూడు నెలల పాటు వీళ్ళు సెలవులో ఉండాలని కోరింది. అయితే ఈ సమయంలో వాళ్ళను సంస్థ ఉద్యోగుల గానే పరిగణిస్తామని..వాళ్లకు హెల్త్ బెనిఫిట్స్ తో పాటు ఎర్న్డ్ లీవ్ సౌకర్యం కూడా ఉంటుంది అని తెలిపారు. ప్రస్తుతం స్పైస్ జెట్ కేవలం 22 విమానాలను మాత్రమే నడుపుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా స్పైస్ జెట్ మార్కెట్ వాటా కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో శుక్రవారం నాడు స్పైస్ జెట్ షేర్ ధర ఆరు శాతం నష్టపోయి 62 రూపాయల వద్ద ముగిసింది. ఒక వైపు దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న వేళ స్పైస్ జెట్ చిక్కుల్లో పడటం దేశీయ విమానయాన రంగంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. మరో వైపు స్పైస్ జెట్ ఎదుర్కొంటున్న సమస్యలు ఇండిగో కు కలిసివస్తున్నాయి అనే చెప్పాలి.

Tags:    

Similar News