గత కొన్ని రోజులుగా సోనూసూద్ నివాసాలు, కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తున్న ఐటి శాఖ శనివారం నాడు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తమ పరిశీలనలో పలు అనుమానిత లావాదేవీలను గుర్తించినట్లు ఐటి శాఖ వెల్లడించింది. సోనూ సూద్ ఆయన అనుబంధ సంస్థలు 20 కోట్ల రూపాయల మేర పన్ను ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించారు. అదే సమయంలో సోనూ సూద్ సేవా కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన పౌండేషన్ కూడా క్రౌడ్ ఫండింగ్ ఫ్లాట్ ఫామ్ ద్వారా 2.1 కోట్ల రూపాయలు సమీకరించినట్లు గుర్తించారు.
ఇది ఎఫ్ సి ఆర్ ఏ నిబంధనలకు వ్యతిరేకం అన్నారు. లెక్కల్లో చూపని ఆదాయానికి సంబంధించి పలు లావాదేవీలు గుర్తించారని..అన్ సెక్యూర్డ్ రుణాలు కూడా భారీ ఎత్తున తీసుకున్నట్లు గుర్తించారు. తన దగ్గర ఉన్న నగదును ఇతరులకు ఇచ్చి వారి ద్వారా చెక్ లు తీసుకున్నారని ఐటి శాఖ తెలిపింది. ఆస్తుల సేకరణ, పెట్టుబడుల కోసం బోగస్ రుణాలు తీసుకున్నట్లు తెలిపారు. లక్నోకు చెందిన ఓ మౌలికసదుపాయాల సంస్థతో అక్రమ లావాదేవీలు జరిగినట్లు విచారణల్లో గుర్తించారు.