చౌక ధరల ఎయిర్ లైన్స్ స్పైస్ జెట్ మరోసారి ప్రయాణికులకు చుక్కలు చూపించింది. గత కొంత కాలంగా ఈ ఎయిర్ లైన్స్ సర్వీసులు పలు సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. శనివారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ కు బయలుదేరిన విమానంలో సమస్యలు వచ్చాయి. విమానం ఐదు వేల అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో ఏకంగా క్యాబిన్ లోనే పొగలు రావటంతో పైలట్, విమాన సిబ్బంది అత్యవసరంగా విమానాన్ని తిరిగి ఢిల్లీలోనే ల్యాండ్ చేశారు.
అయితే విమానంలో వచ్చిన పొగకు ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అవటంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. క్యూ400 ఎయిర్ క్రాఫ్ట్ లో ఈఘటన చోటుచేసుకుంది. అయితే ఎలాంటి ప్రమాదం లేకుండా విమానం సేఫ్ ల్యాండ్ కావటంతో ప్రయాణికులు అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణీ కులందరూ సురక్షితంగా ఉన్నారని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది.