భారత్ అమెరికా రికార్డును తిరగరాసింది. ప్రపంచంలో ఇఫ్పటివరకూ ఒక్క అమెరికాలోనే ఒక్క రోజులో మూడు లక్షలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది జనవరిలో ఈ స్థాయి కేసులు వచ్చాయి అమెరికాలో. ఇప్పుడు భారత్ లో అమెరికాను దాటి ఒక్క రోజులో ఏకంగా 3.14 లక్షల కేసులు నమోదు కావటం కలవరానికి గురిచేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాలు కరోనా రెండవ దశ కేసులకు విలవిలలాడుతున్నాయి. వీటిని ఎదుర్కొవటం పెద్ద సవాల్ గా మారింది. దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ప్రధాన సమస్యగా మారింది. పలు రాష్ట్రాల్లో కరోనా రోగులకు బెడ్స్ కూడా దొరకని పరిస్థితి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,14,835 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో మరణాలు 2104 కు చేరాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
దేశంలో ఇంత పెద్ద ఎత్తున మరణాలు నమోదు కావటం కూడా ఇదే మొదటిసారి. కరోనా నుంచి 1,78,841 మంది బాధితులు కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 1,59,30,965 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి మొత్తం 1,34,54,880 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 22,91,428 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 13.23 కోట్ల మందికి పైగా కోవిడ్ టీకాలు అందించినట్లు వైద్య శాఖ డేటా చెబుతోంది.