భారత్ లో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకాలకు సంబంధించి 'కోవిషీల్డ్ ' వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఒక్కో డోస్ ను 250 రూపాయలకు అందించనుంది. అయితే అది ప్రభుత్వానికి అందించే ధర మాత్రమే. ఈ మేరకు త్వరలో ఒప్పందం జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల పత్రిక బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది. సీరమ్ భారత్ లో ఈ వ్యాక్సిన్ కు సంబంధించి మూడవ దశ ప్రయోగాలను కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ ఖచ్చితంగా విజయవంతం అవుతుందన్న నమ్మకంతో ఇప్పటికే భారీ ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తి కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే.
కొద్ది రోజుల క్రితం తమ వ్యాక్సిన్ వెయ్యి రూపాయల వరకూ ఉంటుందని ఎస్ఐఐ సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు.అయితే ప్రభుత్వం భారీ ఎత్తున కొనుగోళ్లు చేసే అవకాశం ఉండటంతో ధర తగ్గిస్తున్నట్లు తెలిపారు. సీరమ్ కు చెందిన కోవిషీల్డ్ కూడా భారత్ లో అత్యవసర వినియోగానికి అనుమతించాల్సిందిగా ఇప్పటికే డీసీజిఐ కు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. తొలుత ఫైజర్, తర్వాత సీరమ్ తోపాటు తాజాగా భారత్ బయోటెక్ కూడా అత్యవసర వినియోగ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది.