దేశ వ్యాక్సినేషన్ విధానంపై విమర్శలు అన్నీ ఇన్నీ కావు. అదే సమయంలో దేశంలో అత్యధిక వ్యాక్సిన్లు సరఫరా చేస్తున్న సీరమ్ సంస్థ కూడా వాస్తవాలు చెప్పి చిక్కుల్లో పడింది. అసలు సరైన ప్రణాళిక లేకుండా అందరికీ వ్యాక్సిన్లు వేస్తామని చెప్పటం ఏ మాత్రం సరికాదని..అసలు వ్యాక్సిన్లు ఉన్నాయా లేనిది అని చూసుకోకుండా అన్ని వయస్సుల వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించటం సరికాదంటూ సీరమ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సురేశ్ జాదవ్ వ్యాఖ్యానించారు. ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీరమ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వ్యాఖ్యలు పెద్ద సంచలనంగా మారాయి. ప్రతిపక్షాలకు ఈ వ్యాఖ్యలు ఓ ఆయుధం ఇచ్చినట్లు అయింది. దీంతో సీరమ్ చిక్కుల్లో పడింది. అందులో బాగంగానే దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సురేశ్ జాదవ్ అభిప్రాయానికి కంపెనీకి సంబంధం లేదని..ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖకు కంపెనీ డైరక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ లేఖ రాశారు. సీఈవో అదర్ పూనావాలా తరపున తాను లేఖ రాస్తున్నట్లు తెలిపారు. పూనావాలా మాత్రమే కంపెనీ అధికార ప్రతినిధి అని లేఖలో స్పష్టం చేశారు.
అదే సమయంలో దేశ అవసరాలకు అనుగుణంగా కోవిషీల్డ్ ఉత్పత్తని పెంచేందుకు అవసరమైనన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సరైన ఏర్పాట్లు లేకుండా..అసలు దేశంలో ఎన్ని వ్యాక్సిన్లు ఉన్నాయనే అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా 18 సంవత్సరాల పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్నామని చెప్పిన కేంద్రం ఆ తర్వాత చేతులెత్తేసింది. ఇది తీవ్ర విమర్శల పాలైంది. 18 సంవత్సరాల వయస్సు వారికే కాదు..45 సంవత్సరాలు దాటిన వారికి కూడా పలు చోట్ల రెండవ డోస్ వ్యాక్సిన్లు దొరకని పరిస్తితి. విదేశాల నుంచి వ్యాక్సిన్ల దిగుమతికి అనుమతి ఇస్తున్నామని ప్రకటించినా ఇంకా ఇది వివిధ దశలు దాటాల్సి ఉంది.