జెలెన్‌స్కీ సంచలన ఆరోపణలు

Update: 2026-03-24 08:26 GMT

అమెరికా, ఇజ్రాయెల్ ల ముందు ఇరాన్ ఏ రకంగానే నిలబడలేదు. కానీ ఇటీవల యుద్ధంలో మాత్రం ఆ రెండు దేశాలకు చుక్కలు చూపించటంలో మాత్రం సక్సెస్ అయింది. ప్రపంచంలోనే అమెరిగా అన్ని రకాలుగా నంబర్ వన్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఈ దేశం ఎంతో ముందు వరసలో ఉంటుంది. అమెరికా-ఇజ్రాయెల్ లు సంయుక్తంగా చేసిన దాడుల్లో ఇరాన్ భారీగా నష్టపోయింది. ఎంతో మంది కీలక నేతలు కూడా హత్యకు గురయ్యారు. అయినా కూడా ఇరాన్ ఏ దశలో కూడా వెనక్కి తగ్గినట్లు కనిపించలేదు. పైగా కీలక నేతలు హతమైన సమయంలో కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు కొనసాగించింది. దీంతో ఈ యుద్ధం కారణంగా చేసిన ఖర్చు ఒకటి అయితే...గల్ఫ్ దేశాల్లో ఇరాన్ దెబ్బతీసిన అమెరికా స్థావరాల నష్టం కూడా భారీగా ఉంటుంది అని నివేదికలు వస్తున్నాయి.

                                   అయితే ఈ విషయాలు ఏమి పెద్దగా బయటకు రాకుండా అమెరికా తొక్కిపెడుతుంది అనే చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే ఇరాన్ చేతిలో అమెరికా ఇంత భారీగా నష్టపోయినట్లు ప్రపంచానికి వెల్లడి అయితే తమ పరువు పోతుంది అనే భయం కూడా అగ్రరాజ్యంలో ఉంది. అయితే ఈ కీలక యుద్ధంలో ఇరాన్ కు రష్యా తెర వెనక ఉండి మద్దతు అందిస్తోంది అనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతోన్న యుద్ధంలో ఇరాన్‌కు రష్యా ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇస్తోందని అయన వెల్లడించారు. దీనికి సంబంధించి తమ వద్ద తిరుగులేని ఆధారాలు ఉన్నాయన్నారు.

                                           పశ్చిమాసియాలో అస్థిరతను సృష్టించడానికి రష్యా తన నిఘా వ్యవస్థలను ఉపయోగించి ఇరాన్‌కు సహాయం చేస్తోందని చెప్పారు. రష్యా తన సొంత రేడియో-టెక్నికల్, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను ఉపయోగించి సేకరించిన సమాచారాన్ని ఇరాన్ ప్రభుత్వంతో పంచుకుంటోందని జెలెన్‌స్కీ తెలిపారు. అమెరికా, ఇతర మిత్రదేశాల ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేస్తున్న దాడులకు ఈ నిఘా సమాచారం ఎంతో కీలకంగా మారుతోందని ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ గుర్తించిందని ఆయన వెల్లడించారు. ఈ సహకారం కేవలం ఇద్దరు మిత్రుల మధ్య సంబంధం కాదని, ఇది ప్రపంచ భద్రతకు ముప్పు కలిగించే విధ్వంసక చర్య అని జెలెన్‌స్కీ చెప్పటం విశేషం. రష్యా, ఇరాన్ పాలకులు ద్వేషంలో తోబుట్టువులని.. అందుకే అవి ఆయుధాల విషయంలోనూ భాగస్వాములుగా మారాయని జెలెన్‌స్కీ అన్నారు.

                                                               Full Viewగత కొంతకాలంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ తయారు చేసిన 'షాహెద్' డ్రోన్లను రష్యా విరివిగా ఉపయోగిస్తోందని, దీనికి ప్రతిఫలంగా రష్యా ఇప్పుడు ఇరాన్‌కు అత్యాధునిక నిఘా సమాచారాన్ని, శాటిలైట్ చిత్రాలను టెక్నాలజీని అందిస్తోందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి అని తెలిపారు. ఈ అంశంపై ప్రపంచ దేశాలు తక్షణమే స్పందించి, ఈ అక్రమ నిఘా మార్పిడిని అడ్డుకోవాలని ఉక్రెయిన్ కోరింది. కొద్ది రోజుల క్రితం జెలెన్‌స్కీ ఇరాన్ డ్రోన్లను ఎదుర్కోవటానికి తాము గల్ఫ్ దేశాలకు సాంకేతిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. దీని కోసం తమ దేశానికీ చెందిన వాళ్ళు ఎంతో మంది అక్కడకు వెళ్లారు అని కూడా ప్రకటించుకున్నారు. అయితే జెలెన్‌స్కీ ప్రకటనపై అమెరికా ఎలా స్పందిస్తోందో చూడాలి. జెలెన్‌స్కీ కి తెలిసిన విషయం అమెరికా కు తెలియకుండా ఉండే అవకాశం లేదు అని...దీనిపై గతంలో కూడా అంతర్జాతీయ మీడియా లో కథనాలు వచ్చాయి అనే చర్చ కూడా సాగుతోంది.

Tags:    

Similar News