కోట్ల రూపాయల డబ్బు ఉంటే ఏమి లాభం. చిన్న చిన్న ఖర్చులకు కూడా కక్కుర్తి. డబ్బున్న వాళ్లు అందరూ అలాగే ఉంటారని కాదు..కానీ చాలా మంది మాత్రం ఇదే బాపతు. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా ఎన్నో వెలుగు చూశాయి. అలాంటిదే ఓ ఆసక్తికర పరిణామం ఒకటి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేంటో మీరూ చూడండి. ఆయనో శివసేన నాయకుడు. ఈ మధ్యే ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి రోల్స్ రాయిస్ కారు కొన్నాడు. ఆ కారుతో ఎంచక్కా ఫోటోలకు ఫోజులిచ్చాడు కూడా. అంత వరకూ బాగానే ఉంది. కానీ ఆయనగారి నిర్వాకం వెలుగుచూసిన తర్వాత అందరూ అవాక్కు అయ్యారు. అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారు కొనుగోలు చేసిన ఆయన 35 వేల రూపాయల విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డాడు. ఈ మేరకు మహారాష్ట్రలోని థాణేలో ఆయనపై కేసు కూడా నమోదు అయింది. 35 వేల రూపాయల విద్యుత్ చౌర్యానికి పాల్పడగా..ఆయన కు అధికారులు బిల్లు పంపారు.
అది కూడా కట్టకపోవటంతో మరో 15 వేల రూపాయల జరిమానా కూడా విధించారు. చివరకు అంతా చెల్లించి చేతులు దులుపుకున్నాడు. శివసేనకు చెందిన సంజయ్ గైక్వాడ్ పై మహారాష్ట్ర రాష్ట్ర విద్యుత్ పంపీణీ సంస్థ (ఎంఎస్ఈడీసీఎల్) కేసు నమోదు చేసింది. కళ్యాణి తూర్పు ప్రాంతంలోని సర్వే నెంబర్ 30లో నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణం సాగుతున్న చోటే అధికారులు విద్యుత్ చౌర్యాన్ని గుర్తించారు. పక్కాగా నిర్ధారించుకున్న తర్వాతే 34,840 రూపాయల బిల్లు వేయటంతోపాటు..15 వేల రూపాయల జరిమానా కూడా విధించారు. బిల్లు చెల్లింపులో జాప్యం జరగటం విద్యుత్ శాఖ అధికారులు మహాత్మాపూలే పోలీస్ స్టేషన్ లో గైక్వాడ్ పై విద్యుత్ చట్టం 2003లోని 135 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. చివరకు గైక్వాడ్ జరిమానాతో బిల్లు మొత్తం చెల్లించటంతో క్రిమినల్ చర్యల నిలిపివేసినట్లు తెలిపారు. రోల్స్ రాయిస్ కారు కొనటమే కాదు...ఇలాంటి రోత పనులు చేయకుండా ఉంటేనే గౌరవం ఉంటుందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.