సోమవారం నాడు కూడా స్టాక్ మార్కెట్లో దూకుడు కొనసాగింది. ముఖ్యంగా అత్యధిక వెయిటేజ్ గల రిలయన్స్ షేరు ధర ప్రారంభంలోనే ఏకంగా 62 రూపాయల మేర లాభపడింది. ఓ దశలో 2457 రూపాయలకు చేరింది. ఇదే ఇప్పటివరకూ కంపెనీ 52 వారాల గరిష్ట ధర కావటం విశేషం. రిలయన్స్ దూకుడుతో బీఎస్ఈ సెన్సెక్స్ కూడా మూడు వందల పాయింట్ల లాభంతో 58,427 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
గత కొన్ని రోజులుగా రిలయన్స్ షేరు లాభాల బాటలో పయనిస్తోంది. ఈ షేరుకు ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతాల్లో అమ్మకం దారులు కేవలం 36 వేల మంది ఉండగా...కొనుగోలుదారులు మాత్రం రెండున్నర లక్షల మందిపైనే ఉన్నారు. పలు షేర్లు లాభాల బాటలోనే సాగుతున్నాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 15,66,729.97 కోట్ల రూపాయలకు చేరింది.