
టెస్లా కు మాత్రం రెడ్ కార్పెట్
తమ కృషి కూడా ఉంది అంటూ కేటీఆర్ ట్వీట్
ఎలక్ట్రిక్ కార్ల తయారీ విషయంలో దేశంలోకి ఎంపిక చేసిన సంస్థలను మాత్రమే అనుమతి ఇస్తామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అమెరికా కు చెందిన ప్రపంచ నంబర్ వన్ సంపన్నుడు ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా కు మాత్రం రెడ్ కార్పెట్ వెల్ కం చెప్పాలని నిర్ణయించిన కేంద్రం ..చైనా కు చెందిన బీవైడీ కి మాత్రం రెడ్ సిగ్నల్ వేశారు. ఇప్పటిలో బీవైడీ కు అనుమతి ఇచ్చే ఛాన్స్ లేదు అని స్పష్టం చేశారు. దేశీయ మార్కెట్ లోకి ఎవరిని అనుమతి ఇస్తున్నాం అనే విషయంలో తాము జాగ్రత్తగా ఉంటున్నాం అని...ఇప్పటికైతే బీవైడీ కి నో ఛాన్స్ అన్నారు.
కొద్ది రోజుల క్రితమే తెలంగాణాలో బీవైడీ తన యూనిట్ ఏర్పాటు చేయబోతుంది...పెట్టుబడి కూడా ఏకంగా దగ్గర దగ్గర 80 వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. బీవైడీ తెలంగాణాలో తో పాటు దేశంలో ఏ రాష్ట్రంలో యూనిట్ పెట్టాలన్న కూడా కేంద్రంలోని మోడీ సర్కారు అనుమతి మంజూరు చేయాల్సి ఉంటుంది. పొరుగు దేశం అయిన చైనాతో ఇప్పటికే ఎన్నో సమస్యలు ఉన్నాయి. దేశీయ ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులకు సంబంధించి వంద శాతం ఎఫ్ డీఐ అనుమతి ఉన్నా కూడా భారత్ తో సరిహద్దు పంచుకునే దేశాల విషయంలో మాత్రం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో అత్యంత కీలకమైనది సెక్యూరిటీ కియరెన్సు.
వాస్తవానికి బీవైడీ గతంలో కూడా హైదరాబాద్ కేంద్రం గా పని చేసే మేఘా ఇంజనీరింగ్ తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా అప్పుడు కూడా కేంద్రం నో చెప్పింది. కానీ సడన్ గా తెలంగాణాలో కంపెనీ యూనిట్ ఏర్పాటుకు అంతా సిద్ధం అయింది అని వార్తలు రాగా...విచిత్రంగా మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇందులో తమ కృషి కూడా ఉంది అని చెప్పుకుంటూ ట్వీట్ చేశారు. కానీ ఇప్పుడు అసలు ఇండియాలోకి బీ వై డీ ని అనుమతించటం లేదు అని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.
చైనా కంపెనీలను అనుమతించాలి అంటే ఎన్నో అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది అన్నారు. మరో వైపు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రేపిన సుంకాల సునామీతో ఇప్పుడు వ్యవహారం మరింత సంక్లిష్టంగా మారింది అనే చెప్పాలి. ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో న్యాయబద్ధంగా వ్యవహరించటం లేదు అన్నారు. పీయూష్ గోయల్ ప్రకటనతో గత కొన్ని రోజులుగా తెలంగాణ కు బీవైడీ యూనిట్ వస్తుంది అనే ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు అని తేలినట్లు అయింది అనే చర్చ ప్రారంభం అయింది.