రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) మళ్లీ వడ్డీ రేట్లు పెంచింది. ద్రవ్యోల్భణం కట్టడే టార్గెట్ గా ఆర్ బిఐ నిర్ణయాలు తీసుకుంటోంది. రెండు రోజుల సమీక్ష తర్వాత బుధవారం నాడు ఆర్ బిఐ తన నిర్ణయాలను ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న రేటుపై అదనంగా 50 బేసిస్ పాయింట్లు రెపో రేటు పెంచుతున్నట్టు ఆర్ బిఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. దీంతో రెపోరేటు 4.40 శాతం నుంచి 4.90 శాతానికి పెరిగింది. తాజా పెరుగుదలతో వడ్డీరేటు ఒక శాతం (0.90) పెరిగినట్లు అయింది. పెరిగిన రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆర్ బిఐ తెలిపింది.
దాదాపు నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు రెపోరేటు పెరిగింది. ఏప్రిల్, మే నెలలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని ప్రకటించింది. జీడీపీ వృద్ధిరేటును 7.2 శాతంగా అంచనా వేసింది.రాబోయే రోజుల్లోనూ వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. రెపో రేటు ఈ ఆర్ధిక సంవత్సరాంతానికి 5.6 శాతానికి చేరే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. తాజా వడ్డీ రేట్ల పెంపుతో ఇంటి రుణాలతోపాటు కార్లు, వ్యక్తిగత రుణాల ఈఎంఐలు పెరగటం పక్కాగా కన్పిస్తోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇది మరింత భారం కానుంది.