కరోనా తొలి దశలో డెబ్బయి వేల కేసులు చేరుకోవటానికి నెలల సమయం పట్టింది. కానీ ఈ సారి మాత్రం తీవ్రత అందుకు భిన్నంగా ఉందని ఎయిమ్స్ డైరక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా వ్యాఖ్యానించారు. రెండవ దశ కరోనా ఈ నెలలో తారాస్థాయిలో ఉండొచ్చని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశంలో అవసరమైన చోట్ల మినీ లాక్‌డౌన్లు విధించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
సాధ్యమైనంత వరకూ విమాన ప్రయాణాలతో పాటు, రోడ్డు, రైలు ప్రయాణాలకు కూడా ప్రజలు దూరంగా ఉండటం మంచిదని ఆయన సూచించారు. రణ్ దీప్ గులేరియా కోవిడ్-19 మేనేజిమెంట్ జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా కూడా ఉన్న విషయం తెలిసిందే. కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు మాస్క్ లు ధరించడం లేదని, సామాజిక దూరం పాటించడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.