వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి కంపెనీలో ఐటి శాఖ భారీ ఎత్తున అక్రమాలు గుర్తించింది. వేల కోట్ల రూపాయల కృత్రిమనష్టాలను చూపించటం ఒకెత్తు అయితే..భారీ ఎత్తున నల్లధనం వెలికిచూడటం మరో అంశం. అంతే కాదు..లెక్కలు..పత్రాల్లో భారీ గోల్ మాల్ ను ఐటి శాఖ గుర్తించింది. ఏకంగా 1200 కోట్ల రూపాయల కృత్రిమ నష్టాలను రాంకీ గ్రూప్ చూపించినట్లు ఐటి శాఖ గుర్తించింది. ఈ మొత్తాలకు సంబంధించి ఆయా కంపెనీలే ఐటి కట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 6న రాంకీ గ్రూప్ సంస్థల్లో ఐటి శాఖకు చెందిన 15 టీమ్ లు దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన విషయాలను ఐటి శాఖ వెల్లడించింది. రాంకీ గ్రూప్‌లో 300 కోట్ల రూపాయల నల్లధనం వెలికితీసినట్టు కేంద్ర ఆదాయ పన్నుశాఖ వెల్లడించింది.
300 కోట్ల నల్లధనానికి పన్ను చెల్లించేందుకు రాంకీ సంస్థ అంగీకరించినట్లు వెల్లడించింది. అక్రమ ఆర్ధిక లావాదేవీలు జరిగినట్లు నిరూపించే.. పలు డాక్యుమెంట్లు ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. రాంకీ చైర్మన్ అయోధ్య రామిరెడ్డి ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. రాంకీ గ్రూప్ మేజర్ వాటాని సింగపూర్ వ్యక్తులకు అమ్మేశారని ఈ సమయంలో భారీ ఎత్తున క్యాపిటల్ గెయిన్స్ పొందినట్లు తెలిపారు. ఈ లావాదేవీలకు సంబంధించిన పలు అక్రమాలు జరిగినట్లు ఐటి శాఖ గుర్తించింది. ఈ తనిఖీలకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతుందని పేర్కొంది.