రజనీకాంత్ కు 'దాదా సాహెబ్ పాల్కే అవార్డు'

Update: 2021-04-01 12:26 GMT

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఉన్న రజనీకాంత్ కు ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. కేంద్రం ఆయనకు గురువారం నాడు దాదాసాహెబ్ పాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. 51వ దాదాసాహెబ్ పాల్కే అవార్డును ఆయనకు ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. ఈఅవార్డు ప్రకటనపై రజనీకాంత్ స్పందించారు. 2020 సంవత్సరానికిగాను తనను అత్యుుత్తమ పురస్కారానికి ఎంపిక చేయడంపై తలైవా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనగురువు, సోదరుడుతోపాటు సినీ పరిశ్రమలోని పెద్దా చిన్నా, కేంద్ర, రాష్ట్ర రాజకీయ నేతలతోపాటు, స్నేహితులు, అభిమానులు అందరికీ పేరు పేరునా అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా తనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినందుకుగాను ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, జ్యూరికీ కృతజ్ణతలు  తెలిపారు.

తన స్నేహితుడు రాజ్‌ బహదూర్‌, తనలోని నటనా నైపుణ్యాన్ని గుర్తించిన బస్‌ డ్రైవర్‌, తన ఉన్నతికి కారణమైన సోదరుడు రావు గైక్వాడ్‌తో పాటు తనను రజనీకాంత్‌గా సినీ పరిశ్రమకు పరిచయం చేసిన గురువు కె. బాలచందర్‌ కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన దర్శంకులు,నిర్మాతలు, టెక్నీషియన్లు, మీడియాకు, తమిళ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఈ అవార్డు అంకితమని రజనీ ‌ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, అలాగే ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్‌, తన సహ నటుడు కమల్‌హాసన్‌, ఇతర రాజకీయ నాయకులు, హితులు, సన్నిహితులందరికీ ఆయన స్పెషల్‌ థ్యాంక్స్‌ చెప్పారు. రజనీకి ఈ అవార్డును ఇవ్వాలన్న జ్యూరీ నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించిందని కేంద్రమంత్రి ప్రకాష్ జవడేకర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ, ఇతర రంగ ప్రముఖుల నుంచి ఆయనకు అభినందనల వెల్లువ కురుస్తోంది. భారతీయ సినిమా పితామహుడుగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో 1963లో ఈ అవార్డును ప్రారంభించారు. అయితే దివంగత పాపులర్‌ నటుడు శివాజీ గణేషన్, దర్శకుడు కె.బాలచందర్ తర్వాత ఈప్రతిష్టాత్మక అవార్డును పొందిన తమిళ సినీ రంగానికి చెందిన మూడవ వ్యక్తిగా రజనీకాంత్‌ నిలిచారు.

Tags:    

Similar News