మొత్తం ఆస్తులు 20 కోట్లే

Update: 2024-04-04 16:28 GMT

Full Viewనేతలకు రాజకీయమే పెద్ద వ్యాపారం అనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అవి మరింత పెరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలవటం కోసం ముందు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత అంతకు ఎన్నో రేట్లు సంపాదించుకుంటారు అనే ఆరోపణలు లేకపోలేదు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జనరల్ లోక్ సభ సీటు బరిలో నిలబడే వారి ఖర్చు తక్కువలో తక్కువ వంద కోట్ల రూపాయలపైమాటే అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎన్నికల సంఘం అనుమతించిన దానికి ...వాస్తవ ఖర్చకు మధ్య ఎక్కడా పొంతన ఉండదు. అయితే గతంతో పోలిస్తే రాజకీయ నాయకులు కూడా ఒక వైపు రాజకీయం చేస్తూనే అటు రియల్ ఎస్టేట్ రంగంతో పాటు స్టాక్ మార్కెట్ లో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పుడు ఇది అంతా ఎందుకు అంటే కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ స్టాక్ మార్కెట్ లో పెట్టిన పెట్టుబడి విషయాలు ఇప్పుడు అందరిలో ఆసక్తిరేపాయనే చెప్పొచ్చు.

ఈ ఎన్నికల్లో ఆయన మరోసారి కేరళ లోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ సమర్పించిన అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. అందులో స్టాక్ మార్కెట్ పెట్టుబడులు కూడా ఉన్నాయి. స్టాక్ మార్కెట్ లో ఆయన పెట్టుబడి మొత్తం విలువ దగ్గర దగ్గర 4 . 3 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. రాహుల్ గాంధీ పోర్ట్ ఫోలియో లో ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంకు , టైటాన్, పిడిలైట్, టిసిఎస్, బజాజ్ ఫైనాన్స్, ఆసియన్ పెయింట్స్, దీపక్ నైట్రేట్, దివీస్ లాబొరేటరీస్, హిందుస్థాన్ లివర్, ఇన్ఫో ఎడ్జ్, నెస్లే తదితర షేర్లు ఉన్నాయి. షేర్ల తో పాటు రాహుల్ గాంధీ గోల్డ్ బాండ్స్ లో కూడా పెట్టుబడి పెట్టారు. మొత్తం మీద రాహుల్ గాంధీ ఆస్తులు 20 కోట్ల రూపాయలు ఉన్నట్లు ఆయన అఫిడవిట్ లో వెల్లడించారు. దీంతో ఇప్పుడు రాహుల్ గాంధీ పోర్ట్ ఫోలియో లో ఉన్న షేర్ల వివరాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉంటే ఆయన అఫిడవిట్ ప్రకారం రాహుల్ గాంధీ కి సొంత కారు, ఇల్లు మాత్రం లేవు.

Tags:    

Similar News