కొత్త పార్లమెంట్ భవనానికి మోడీ శంకుస్థాపన

Update: 2020-12-10 08:36 GMT

అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న నూతన పార్లమెంట్‌ భవన నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు. సర్వమత ప్రార్ధనలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రాజెక్టుకు మోడీ గురువారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ వెంకటేశ్‌ జోషీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణసింగ్‌ తదితరులు హాజరయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలోని సంసద్‌ మార్గ్‌ లో మొత్తం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుత భవనానికి వందేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంలోనే ఈ కొత్త భవన నిర్మాణానికి సంకల్పించినట్లు కేంద్రం తెలిపింది.

శంకుస్థాపన చేసిన ఈ కొత్త భవనం నిర్మాణాన్ని 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న 2022 ఆగస్టు 15 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నాలుగు అంతస్తుల కొత్త పార్లమెంట్‌ భవనాన్ని రూ.971 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించారు. త్రిభుజకారంలో ఉండే ఈ భవనాన్ని భూకంపాలను కూడా తట్టుకునేలా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్నారు. ఈ భవనంలో 888 మంది లోక్‌సభ సభ్యులు, 384 మంది రాజ్యసభ సభ్యులకు చోటు ఉండేలా నిర్మాణం చేయనున్నారు.

Tags:    

Similar News