పేటిఎం ఇన్వెస్టర్స్ లో చిగురిస్తున్న ఆశలు

Update: 2023-10-21 10:22 GMT

Full Viewదేశంలో ఇప్పుడు మెజారిటీ చెల్లింపులు పేటిఎం ద్వారానే జరుగుతున్నాయంటే ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. చిలక జోస్యం దగ్గర నుంచి టీ బడ్డీ, పాన్ షాప్ ఏదైనా సరే పేటిఎం కామన్ అయిపొయింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ మార్గం ద్వారానే చెల్లింపులు జరుగుతున్నాయి. పేటిఎంకు చెందిన మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ స్టాక్ మార్కెట్ లోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. కానీ ఇప్పటివరకు పేటిఎం షేర్ ధర ఆఫర్ ప్రైస్ 2150 రూపాయలను దాటలేదు. ఆఫర్ ప్రైస్ ను దాటటం సంగతి అలా ఉంచి కనీసం ఆ దరిదాపుల వరకు కూడా రాలేదు. మార్కెట్ నుంచి పేటిఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ 18300 కోట్ల రూపాయలు సమీకరించింది. దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎల్ఐసి తర్వాత రెండవ అతి పెద్ద ఐపీఓ ఇదే. పేటిఎం పబ్లిక్ ఇష్యూ మార్కెట్ లో సంచలనాలు నమోదు చేసింది కానీ...ఆ తర్వాత మాత్రం ఇందులో పెట్టుబడులు పెట్టిన వారికి చుక్కలు చూపిస్తూ వస్తోంది. ఇప్పుడిప్పుడే ఈ షేర్ ప్రైస్ గాడిన పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే పేటిఎం ఏడాది కనిష్ట ధర 440 రూపాయలతో పోలిస్తే ప్రస్తుతం ఇది రెట్టింపు అయి 52 వారాల కొత్త గరిష్ట స్థాయి 998 రూపాయలకు చేరింది.

                                       శుక్రవారం నాడు ఈ కొత్త రికార్డు ను అందుకొని...చివరకు 19 రూపాయల లాభంతో 987 రూపాయల వద్ద క్లోజ్ అయింది. తాజాగా వెల్లడైన కంపెనీ ఫలితాలు చూస్తే పేటిఎం గాడినపడుతున్నట్లే కనిపిస్తోంది. అయితే కంపెనీ ఎప్పుడు లాభాల బాటలోకి వస్తుంది...ఆఫర్ ప్రైస్ ను షేర్ ఎప్పుడు చేరుకుంటుంది అంటే ఇప్పటికిప్పుడు చెప్పటం కష్టమే. కాకపోతే పెరుగుతున్న వ్యాపారం, తగ్గుతున్న నష్టాలు పేటిఎం మదుపుదారుల్లో ఎంతో కొంత ఆశలు అయితే కల్పిస్తున్నాయి అనే చెప్పాలి. జులై-సెప్టెంబర్ మూడు నెలల కాలంలో కంపెనీ నష్టాన్ని 291 కోట్ల రూపాయలకు తగ్గించుకుంది. ఇంతకు ముందు ఏడాది ఇదే కాలంలో నష్టం 571 కోట్ల రూపాయలు ఉంది. ఇదే కాలంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 1914 కోట్ల రూపాయల నుంచి 2518 కోట్ల రూపాయలకు పెరిగింది. ఈ లెక్కలు అన్ని పేటిఎం పుంజుకుంటున్న సంకేతాలు ఇస్తున్నాయి. అదే సమయంలో పలు సంస్థల నుంచి పేటిఎం కు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది అని ఫిన్ టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Tags:    

Similar News