పనామా పేపర్ల వ్యవహారం గుర్తుంది కదా. కేంద్రం ఇప్పడు దీనిపై జోరు పెంచినట్లు కన్పిస్తోంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఇప్పుడు ఈ జాబితాలో పేర్లు ఉన్న వారికి వరస పెట్టి నోటీసులు ఇస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ కు ఇదే అంశంపై నోటీసులు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. పనామా పేపర్స్ లో చాలా మంది ప్రముఖుల పేర్లు వెల్లడయ్యాయి. పనామా పేపర్స్ కేసులో భారత్ నుంచి సుమారు 500 మందికి ప్రమేయం ఉన్నట్లు గతంలోనే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇందులో రాజకీయ నాయకులు, నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు ఉన్నారు.
ఈ కేసులో ప్రమేయం ఉన్నవారు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పనామా పేపర్ల కేసుపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈడీ అధికారులు దేశంలోని పలువురు ప్రముఖులను విచారణలో చేర్చారు. ప్రస్తుతం ఐశ్వర్య రాయ్‌కు సమన్లు జారీ కావడం చర్చనీయంగా మారింది. డిసెంబర్ 20న ఢిల్లీలోని లోక్‌నాయక్ భవన్‌లో తమ ఎదుట హాజరు కావాలని ఈడీ ఆదేశించినట్లు సమాచారం. అయితే ఆమె నోటీసుల ప్రకారం ఈడీ ముందుకు వస్తారా? లేక కొంత సమయం కోరతారా అన్నది వేచిచూడాల్సిందే.