రష్యా దాడులతో ఉక్రెయిన్ విలవిలలాడుతోంది. అయినా సరే ఉక్రెయిన్ సైన్యం, స్థానికులు ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా పోరాటం చేస్తున్నారు.. అయితే ఉక్రెయిన్ లో ఉన్న విద్యార్ధులు..ఉక్రెయిన్ దేశస్తులు కూడా ఈ యుద్ధం నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. భారతీయ విద్యార్ధులు కూడా ఉక్రెయిన్ నుంచి బతుకుజీవుడా అంటూ బయటపడుతున్నారు. భారత ప్రభుత్వం కూడా విద్యార్ధులను రప్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ తరుణంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న పాకిస్థానీ, టర్కిష్ విద్యార్ధులు భారత దేశ జాతీయ పతాకాన్ని రక్షణ కవచంగా ఉపయోగించుకుంటున్నారు.
రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్ నుంచి తప్పించుకోవడానికి విదేశీయులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. భారత ప్రభుత్వం భారతీయులను, విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు పలు మార్గాలను ఎంచుకుంది. భారత దేశ జాతీయ జెండాను స్పష్టంగా కనిపించేలా ఉంచుకుంటే ఇబ్బందులు తలెత్తబోవని భారతీయులకు సూచనలు అందాయి. ఈ సలహాను పాకిస్థాన్, టర్కీ విద్యార్ధులు, జాతీయులు కూడా తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నాలు చేశారు. అయితే ఉక్రెయిన్ నుంచి బయటపడటానికి వీరు భారత్ జెండా ఉపయోగించుకుంటున్నారని అక్కడి నుంచి వచ్చిన విద్యార్ధులు తెలిపారు. భారత జెండాతోపాటు భారతీయ విద్యార్ధులు కూడా ఉక్రెయిన్ నుంచి బయటపడేందుకు తమ వంతు సహకారం అందించారని తెలిపారు.