లీటర్ పెట్రోల్ ధర 233...డీజిల్ 263 రూపాయలు
పాకిస్తాన్ సర్కారు ఆ దేశ పౌరులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. వరస పెట్టి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ పోతుంది. ఈ సమస్యలకు కారణం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖానే కారణం అంటూ విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా పాకిస్తాన్ సర్కారు పెట్రోల్ ధర లీటర్ కు 24.03 రూపాయలు పెంచింది. దీంతో లీటర్ ధర 233.89 రూపాయలకు పెరిగింది.ఇదే రికార్డు ధర ఇప్పటివరకూ . అదే సమయంలో డీజిల్ ధరను 263.31 రూపాయలుగా ప్రకటించారు. కిరోసిన్ ధర లీటర్ కు 211.43 రూపాయలకు చేరింది. ప్రతి లీటర్ పెట్రోల్ పై 24 రూపాయలు, డీజిల్ పై 59.16 రూపాయలు, కిరోసిన్ పై 39.49 రూపాయల మేర నష్టాలను ప్రభుత్వం భరిస్తోందని మంత్రి తెలిపారు.
పెట్రోలియం ఉత్పత్తులపై ఇస్తున్న సబ్సిడీలు ఎత్తేయకపోతే పాకిస్తాన్ కూడా శ్రీలంకలా మారే ప్రమాదంలేకపోలేదని ఆ దేశ ఆర్ధిక మంత్రి మిహతాఫ్ ఇస్మాయిల్ వ్యాఖ్యానించారు. సబ్సిడీలు ఎత్తేయకపోతే పాకిస్థాన్ కూడా డిఫాల్ట్ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. పెట్రోల్ రేట్లు పెంచకపోతే ఐఎంఎఫ్ పాకిస్థాన్ తో ఒప్పందానికి ముందుకు రాదన్నారు. ఇటీవలే శ్రీలంక కూడా అంతర్జాతీయ రుణాలు చెల్లించటంలో విఫలం అయి పీకల్లోతు ఆర్ధిక సమస్యల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఆయన చెప్పినట్లే వెంటనే సబ్సిడీలు భారీగా తగ్గిస్తూ రేట్లు పెంచేశారు.