దేశంలో చాలా వరకూ కరోనా కనుమరుగు అవుతున్నట్లే కన్పిస్తోంది. గత కొన్ని రోజులుగా నమోదు అయ్యే కరోనా కేసులు కూడా భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో భారత్ లో కోవిడ్ మూడవ దశ వచ్చే అవకాశాలు లేవని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతే కాదు...ఒక వేళ ఏదైనా వచ్చినా అది అంత తీవ్రంగా ఉండే ఛాన్స్ లేదని భావిస్తున్నారు. ఈ తరుణంలో ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి భారత్ లో ఎలాంటి బూస్టర్ డోస్ అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.అందరూ వ్యాక్సిన్ కవరేజ్ విషయంపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అసలు వ్యాక్సిన్ తీసుకోని వారికి వ్యాక్సిన్ వేయించటం..ఇప్పటికే తొలి డోసు తీసుకున్న వారికి రెండవ డోసు కూడా పూర్తి చేయించటం కీలకం అన్నారు. దేశంలో వ్యాక్సిన్ నిల్వలు సరిపడినన్ని ఉన్నాయన్నారు.
దేశంలో కరోనా కారణంగా ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యలో పెరుగుదల ఏమీలేదన్నారు. సీరో పాజిటివిటి రేటు గరిష్టంగా ఉందని..ప్రస్తుతానికి బూస్టర్ డోస్ అవసరం ఉండదన్నారు. అయితే భవిష్యత్ లో ఆ అవసరం రావొచ్చని వ్యాఖ్యానించారు. దేశంలో వ్యాక్సినేషన్ గణనీయంగా పుంజుకోవటం వల్ల కోవిడ్ అదుపులోకి వచ్చిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందరికీ వ్యాక్సిన్ పూర్తయితే దేశంలో దేశ ప్రజలు సేఫ్‌గా ఉండొచ్చని వ్యాఖ్యానించారు. అయితే కరోనా పూర్తిగా పోవటానికి కొంత సమయం పడుతుందని...కేసులు వస్తూనే ఉంటాయన్నారు. పక్కా సమాచారం ఆధారంగానే అదనపు డోసు విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.