దేశ జనాభా 141 కోట్లు ...విమానాలు 700

Update: 2023-02-20 15:00 GMT

Full Viewఇండియా లో ప్రస్తుతం సేవలు అందిస్తున్న విమానాలు 700. మన దేశ జనాభా 141 కోట్ల పైనే. అదే అమెరికా జనాభా 31 కోట్లు. కానీ అక్కడ ఉన్న విమానాలు ఎన్నో తెలుసా..దాదాపు ఆరు వేలు. దేశం లో ఉన్న 700 విమానాల్లో వైడ్ బాడీ అంటే విదేశీ రూట్లలో ప్రయాణించినందుకు అనువైన పెద్ద విమానాలు గరిష్టంగా 50 వరకు ఉంటాయి. దేశం నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా విదేశాలకు చెందిన ఎయిర్ లైన్స్ పైనే ఆధారపడాల్సి వస్తోంది. ఎక్కడ వరకు ఎందుకు అమెరికాలో ఉన్నత విద్య కోసం ఇండియా నుంచి ప్రతి ఏటా లక్షలాది మంది అమెరికా వెళుతుంటారు. ఇందులో ఎక్కువ మంది తమ ప్రయాణాన్ని దుబాయ్ మార్గం నుంచి పెట్టుకుంటారు. ఎందుకు అంటే యూఏఈ కి చెందిన పలు విమాన సర్వీసులు పెద్ద ఎత్తున ఆ రూట్ లో సేవలు అందించే విషయం తెలిసిందే. ఒక్క విద్య కోసమే కాదు దేశం నుంచి ప్రతి ఏటా పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా వివిధ దేశాలకు వెళతారు. వీళ్ళు కూడా విదేశీ ఎయిర్ లైన్స్ సేవలపైనే ఆధారపడుతున్నారు. అందుకే ఇప్పుడు దేశీయ ఎయిర్ లైన్స్ పెద్ద ఎత్తున కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్ లు పెడుతున్నాయి.

                               ఎయిర్ ఇండియా, ఇండిగో తో కలుపుకుని పలు ఎయిర్ లైన్స్ 1115 విమానాల కొనుగోలుకు ఆర్డర్ లు ఇచ్చాయి. దేశ జనాభా ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం ఉన్న విమానాల సంఖ్య చాలా తక్కువ అని ఈ రంగంలోని నిపుణులు చెపుతున్నారు. అమెరికా జనాభానే 31 కోట్లు అయితే ..భారత్ లో మధ్య తరగతి ప్రజలే 44 కోట్ల మేర ఉన్నారని...ఈ లెక్కన రాబోయే సంవత్సరాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య అటు దేశీయంగా...విదేశీ మార్గాల్లోనూ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. వచ్చే పది సంవత్సరాల్లో కేవలం విదేశీ ప్రయాణికుల సంఖ్య 12 కోట్ల పైన ఉండే అవకాశం ఉంది అని అంచనా. దీంతో దేశీయ విమానయాన సంస్థలు మరిన్ని వైడ్ బాడీ విమానాలకు ఆర్డర్ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అని ఈ రంగంలోని నిపుణులు చెపుతున్నారు. 

Tags:    

Similar News