వ్యాక్సినేషన్ పై కొత్త మార్గదర్శకాలు

Update: 2021-05-19 12:36 GMT

నిఫుణుల కమిటీ సూచనల మేరకు అంటూ కేంద్రం గత కొన్ని రోజులుగా వ్యాక్సినేషన్ విషయంలో పలుమార్పులు చేస్తూ పోతుంది. ముఖ్యంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు సంబంధించి తొలి డోసుకు..రెండవ డోసుకు మధ్య గ్యాప్ ను ఇటీవల పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా కేంద్రం మరికొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారు మూడు నెలల తర్వాతే వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గతంలో ఇది 4-8 వారాలుగా మాత్రమే ఉండేది. తొలి డోసు తర్వాత కరోనా వస్తే మూడు నెలలకు రెండో డోసు వేయించుకోవాలని సూచించింది. తీవ్రంగా జబ్బుపడి కోలుకున్న వారికి 4-8 వారాల తర్వాతే టీకా ఇవ్వనున్నట్లు తెలిపింది.

వ్యాక్సిన్ తీసుకున్న 14 రోజుల తర్వాత, ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్ లో నెగిటివ్‌ వచ్చాక రెండు వారాల తర్వాత రక్తదానం చేయవచ్చని వెల్లడించింది. వ్యాక్సినేషన్‌కు ముందు కరోనా నిర్థరణ అక్కర్లేదని కేంద్రం స్పష్టం చేసింది. బాలింతలు కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. అయితే గర్భిణీలకు వ్యాక్సిన్ అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేంద్రం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం మార్పులు చేయాలని రాష్ట్రాలను ఆదేశించారు.

Tags:    

Similar News