గోవా. దేశంలోనే బీచ్ ల రాజధాని. ఇప్పుడు ఈ గోవా బీచ్ ల అందాలు ఉపరితలం నుంచే కాకుండా గాలిలో నుంచి కూడా చూడొచ్చు అన్న మాట. అందుకే బ్లేడ్ ఇండియా అనే సంస్థ కొత్తగా హెలికాప్టర్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం గోవా విమానాశ్రయం నుంచి పర్యాటకులు కోరుకున్న తీరుగా దక్షిణ గోవాలోని బీచ్ లతోపాటు ఉత్తరగోవాలోని బీచ్ లను, చారిత్రక ప్రదేశాల ఉన్న పాత గోవాలోని ఎంపిక చేసిన గ్రామాలను కూడా ఈ హెలికాప్టర్ పర్యటన ద్వారా చూసే అవకాశం రానుంది. ఎవరి ఇష్టాలకు అనుగుణంగా వారు అందుకు సీట్లు బుక్ చేసుకుని పర్యటనలకు వెళ్ళొచ్చు. హెలి టూరిజం ద్వారా పర్యాటకులకు కొత్త అనుభూతుల అందించేందుకు ఈ సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ ప్రకటించింది.
బ్లేడ్ ఇండియా కంపెనీ వెబ్ సైట్ ద్వారా లేదా యాప్ ద్వారా ఈ సీట్లను బుక్ చేసుకోవచ్చు. అంతే కాదు..ప్రయాణికులు మొత్తం హెలకాప్టర్ ను కూడా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని..అక్కడ నుంచి ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్రకు కూడా సర్వీసులు అందిస్తామని తెలిపారు. గోవా బీచ్ లను చూసే ఈ కార్యక్రమం పది నుంచి పదిహేను నిమిషాల వరకూ ఉంటుందని తెలిపారు. ఇప్పటికే బ్లేడ్ ఇండియా మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఇలాంటి సర్వీసులు అందిస్తోంది. విస్తరణలో భాగంగా గోవాలో కూడా కొత్తగా సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన గోవాకు ప్రతి ఏటా పెద్ద ఎత్తున పర్యాటకులు వెళతారనే విషయం తెలిసిందే. ముఖ్యంగా యూత్ ను ఆకర్షించే ప్రాంతం గోవా.