దేశీయ విమానయాన రంగంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇప్పటివరకూ ఒక లెక్క...ఇక నుంచి మరో లెక్క అన్న తరహాలో పరిస్థితి మారనుంది. దేశీయ విమానయాన సంస్థలు తమ ప్రణాళికలకు పదును పెడుతున్నాయి...వ్యూహాలు మారుస్తున్నాయి. ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ కు చేతికి వెళ్ళటంతో ఈ ఎయిర్ లైన్స్ కు పునర్ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఇందుకు అనుగుణంగా ఎయిర్ ఇండియా టాప్ మేనేజ్ మెంట్ లోనూ కీలక మార్పులు జరగనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మరో వైపు దేశంలోని ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ ఝున్ వాలా కూడా ఈ ఏడాది మే నుంచి తన ఆకాశ ఎయిర్ లైన్స్ తో ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. దేశంలోని ప్రముఖ బడ్జెట్ ఎయిర్ లైన్స్ ఇండిగో మారిన పరిస్థితులను ఎదుర్కొని నిలబడేందుకు వీలుగా విస్తరణ ప్రణాళికలు ప్రకటిస్తోంది. దేశీయ మార్కెట్లో అత్యధిక వాటా కలిగిన ఇండిగో ఇప్పుడు టాటా -ఎయిర్ ఇండియా నుంచి ఎదురయ్యే పోటీను పరిగణనలోకి తీసుకుని అంతర్జాతీయ, దూర ప్రాంత సర్వీసులను పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది.
భవిష్యత్ ప్రణాళికలను సమర్ధవంతంగా అమలు చేసేందుకు వీలుగా ఇండిగో సహ వ్యవస్థాపకుడు అయిన రాహుల్ భాటియాను ఎండీగా నియమించింది బోర్డు. దీర్ఘకాలంలో భారత్ తోపాటు అంతర్జాతీయంగా కూడా ఇండిగో సేవలు మరింత విస్తరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను నాన్ స్టాప్ గా చేర్చేందుకు అనువైన ఎ321 ఎక్స్ ఎల్ఆర్ విమానాలను ఇండిగో ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు తాము కొత్త దశలోకి ప్రవేశిస్తున్నామని ఇండిగో చెబుతోంది. వరసగా ఏడు త్రైమాసికాల నుంచి నష్టాలను ప్రకటిస్తూ వస్తున్న ఇండిగో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో మాత్రం 130 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది. కంపెనీ ఆదాయం కూడా అంతకు ముందు ఏడాది కాలంతో పోలిస్తే 89.3 శాతం పెరిగి 9294 కోట్ల రూపాయలకు చేరింది. దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో విమానయాన రంగం తిరిగి త్వరలోనే గాడిన పడుతుందనే అంచనాలు ఉన్నాయి.