నిన్న మొన్నటి వరకు ప్రపంచంలో నంబర్ వన్ సంపన్నుడిగా ఉన్న ఎలాన్ మస్క్ కంపెనీ కీలక ముందడుగు వేసింది. మనిషి మెదడులో విజయవంతంగా చిప్ ను అమర్చింది. ఎలాన్ మస్క్ కు చెందిన న్యూరాలింక్ ఒక మానవ రోగి మెదడులో బ్రెయిన్ ఇంప్లాంట్ చేసినట్లు వెల్లడించింది. ఎలాన్ మస్క్ స్వయంగా ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. న్యూరాలింక్ కంపెనీ విషయంలో ఇది కీలకమైన ముందడుగు అని..దీని ద్వారా రాబోయే రోజుల్లో మనుషులు తమ బ్రెయిన్ తో కంప్యూటర్లను నియంత్రిస్తారు అని పేర్కొన్నారు. మెదడు లో చిప్ పెట్టిన తర్వాత ఆ వ్యక్తి వేగంగా కోలుకుంటున్నాడు అని..ఈ తొలి ప్రయోగం ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉన్నట్లు తెలిపారు.
కంప్యూటర్ తో మానవ మెదడును నేరుగా కనెక్ట్ చేసుకుందుకు ఉద్దేశించిన బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ (బిసిఐ) ప్రయోగాలకు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డిఏ) గత ఏడాదే అనుమతి ఇచ్చింది. మనుషులపై ఈ ప్రయోగాలు చేయటానికి ముందే అంటే ఇప్పటికే న్యూరాలింక్ చిప్ లను పందులు, కోతుల్లో విజయవంతంగా పెట్టి పరీక్షలు నిర్వహించారు. మనిషి మెదడులో విజయవంతంగా చిప్ అమర్చిన న్యూరాలింక్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలన ఫలితాలు సాధిస్తుందో వేచిచూడాలి.