ఇలా కూడా చేస్తారా!

Update: 2024-08-27 04:54 GMT

పేజీలు చింపేస్తే పాస్ పోర్ట్ లో ప్రయాణికుడి ట్రావెల్ చరిత్ర మాయంఅయిపోతుందా?. ఏ మాత్రం అవగాహన ఉన్న వాళ్లకు అయినా ఇది సాధ్యం కాదు అనే విషయం తెలిసిందే. ఒకసారి పాస్ పోర్ట్ అలా స్కాన్ చేస్తే చాలు ఆ ప్రయాణికుడి ట్రావెల్ హిస్టరీ మొత్తం కళ్ళ ముందు కనపడుతుంది. ముఖ్యంగా ఎయిర్ పోర్ట్ అధికారుల నుంచి ఈ విషయంలో తప్పించుకోవటం సాధ్యం అయ్యే పని కాదు. కానీ ముంబై కి చెందిన ఒక ఫ్యాషన్ మర్చండైజింగ్ స్టూడెంట్ తన థాయిలాండ్ పర్యటన విషయాలు కనపడకుండా చేయటం కోసం పాస్ పోర్ట్ లోని నాలుగు పేజీ లు చించేసింది. ఆ విద్యార్థిని పేరు శ్రిష్టిగటోల్ గా అధికార్లులు వెల్లడించారు. 25 సంవత్సరాల ఆ విద్యార్థిని సింగపూర్ లో ఇంటర్న్షిప్ కోసం బయలుదేరింది. ఆమె చదువుతున్న సంస్థే ఈ ఇంటర్న్షిప్ కు స్పాన్సర్ చేసింది. అయితే ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు రొటీన్ చెక్ చేస్తున్న సమయంలో పాస్ పోర్ట్ లో పేజీ లు మిస్ అయిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో విమానం ఎక్కాల్సిన ఆమెను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

                                               అంతే కాదు చీటింగ్ కేసు తో పాటు పాస్ పోర్ట్ చట్టాన్ని ఉల్లఘించిన నిబంధనలపై కేసు పెట్టారు. దీంతో ఆమె సింగపూర్ పర్యటనకు బ్రేక్ పడింది. శ్రిష్టిగటోల్ తాను చదువుకునే సంస్థలో తెలియకుండా అనధికారికంగా ఈ ఏడాది ఫిబ్రవరి 11 నుంచి 14 మధ్య కాలం లో థాయిలాండ్ లో పర్యటించింది. అదే సమయంలో జరిగిన పరీక్షలకు డుమ్మా కొట్టేందుకు తన ఆరోగ్యం బాగాలేదు అని వాళ్లకు చెప్పినట్లు పోలీస్ లు గుర్తించారు. తన పాస్ పోర్ట్ లో అనధికారికంగా చేసిన తన విదేశీ పర్యటన వివరాలు ఉంటే అవి సంస్థ అధికారుల దృష్టిలో పడితే ఇబ్బంది అని ఆమె ఆ పని చేసినట్లు గుర్తించారు. కొద్ది రోజుల క్రితం ఇలాగే ఒక వ్యక్తి తన బ్యాంకాక్ పర్యటన విషయాలు భార్యకు తెలుస్తాయి అని ఇలాగే పాస్ పోర్ట్ లో పేజీ లు చించేసి అధికారులకు పడ్డుబడ్డాడు. విదేశీ పర్యటనలు చేసే వాళ్లకు కూడా పాస్ పోర్ట్ లో పేజీ లు చించితే ఏమి అవుతుందో తెలియకపోవటం ఏమిటో అన్న చర్చ సాగుతోంది.

Tags:    

Similar News