సంపన్నులు ఏమి చేస్తున్నారు. సెలబ్రిటీలు ఏమి కొంటున్నారు. ఈ విషయాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వాళ్ళను అందుకోవటం కష్టం అయినా..వాళ్లు ఏమి కొంటున్నారు..ఏమి చేస్తున్నారు అనే విషయాలపై ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. అందుకే ఓ వార్తలు ప్రముఖంగా కన్పిస్తుంటాయి. నిజానికి దీని వల్ల ఎవరికైనా ఉపయోగమా అంటే జస్ట్ సమాచారం అంతే. తెలుసుకోవాలనుకున్న ఆసక్తి ఉన్న వారికి సమాచారమే. అలాంటిదే ఈ వార్త కూడా. భారత్ కు చెందిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు అయిన అంబానీ, అదానీలు ఏకంగా ఇప్పుడు ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ ను దాటేశారనే వార్తలు వచ్చాయి. అలాంటి అంబానీ ఇప్పుడు 13 కోట్ల రూపాయల వ్యయంతో ఓ కారు కొనుగోలు చేసినట్లు మరో వార్త. నిజానికి ముఖేష్ అంబానీ 13 కోట్ల రూపాయలతో కారు కొనుగోలు చేయటం పెద్ద విషయం ఏమీ కాదు. కానీ అది భారత్ లోని ఖరీదైన కార్లలో ఒకటిగా నిలుస్తోంది. అందుకే దానికి అంత ప్రాధాన్యత.
ఈ కారణంగానే ప్రధాన మీడియాలతోపాటు వెబ్ మీడియాలోనూ దీనికి చోటు దక్కింది. తాజాగా ముఖేష్ అంబానీ 13 కోట్ల రూపాయలు పెట్టి రోల్స్ రాయిస్ ఎస్ యువిని కొనుగోలు చేశారు. వాస్తవానికి ఈ ఎస్ యువి బేస్ ధర 6.95 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ కొనుగోలు చేసిన వ్యక్తి అభిరుచులకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దటం వల్లే ఖరీదు బాగా పెరిగింది. ఈ కారు కోసం రిలయన్స్ సంస్థ ఒకేసారి చెల్లించాల్సి 20 లక్షల పన్ను చెల్లించింది. అదే సమయంలో 12 లక్షల రూపాయలతో ఫ్యాన్సీ నెంబర్ కొనుగోలు చేశారు. హైదరాబాద్ లో టాలీవుడ్ కు చెందిన సెలబ్రిటీలే తమ ఖరీదైన కార్ల కోసం ఏకంగా 25 లక్షల రూపాయలు కూడా చెల్లించిన రోజులు ఉన్నాయి.