కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యాక్సిన్ విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. దేశంలోని రాష్ట్రాలు అన్నింటికి కేంద్రమే వ్యాక్సిన్లు కొనుగోలు చేసి సరఫరా చేస్తోంది. 75 శాతం వ్యాక్సిన్లను కేంద్రం కొంటుంటే మిగిలిన 25 శాతం వ్యాక్సిన్లను ప్రైవేట్ ఆస్పత్రులకు అమ్ముకోవటానికి అనుమతి ఇచ్చారు. అయితే నూతన విధానం అమల్లోకి వచ్చాక తొలి రోజు సాయంత్రం ఐదు గంటల వరకూ దేశ వ్యాప్తంగా 69 లక్షల మందికి పైగా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్రం వెల్లడించింది.
అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టినట్లు వెల్లడించింది. రానున్న రోజుల్లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగే అవకాశం ఉంది. దేశంలోని వ్యాక్సిన్లు తయారీ సంస్థలు ఉత్పత్తిని పెంచటానికి అవసరమైన చర్యలు చేపట్టాయి. దీంతో రాబోయే రోజుల్లో అందుబాటులోకి వచ్చే వ్యాక్సిన్లు కూడా పెరగనున్నాయి.