మోడెర్నా వ్యాక్సిన్ సక్సెస్ రేటు 94.5 శాతం

Update: 2020-11-16 14:00 GMT

కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి ఈ మధ్య అన్నీ మంచి వార్తలే వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే ప్రముఖ ఫార్మా సంస్థ ఫైజర్ కీలక ప్రకటన చేయగా..ఇప్పుడు మోడెర్నా వంతు వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ బయోటెక్నాలజీ కంపెనీ మోడెర్నా తమ ప్రయోగాత్మక వ్యాక్సిన్ కరోనాను 94.5 శాతం మేర నియంత్రించగలుగుతుందని ప్రకటించింది. ఈ సంస్థ మధ్యంతర సమీక్షలో ఈ విషయం వెల్లడైంది. కోవ్‌ అని పిలుస్తున్న ఈ వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్‌ ప్రాథమిక దశ డేటా గేమ్‌ ఛేంజర్‌గా నిలవనుందని వ్యాఖ్యానించింది. 95 మంది కరోనా బాధితులతోపాటు 30వేల మంది పాల్గొన్న వ్యాక్సిన్‌ ప్రయోగాల ఫలితాల ఆధారంగా మోడెర్నా ఈ అంచనాను వెల్లడించింది. తమ మూడవ దశ ప్రాథమిక ఫలితాల్లో తమ టీకా సామర్థ్యం 94.5 శాతంగా అంచనా వేసింది. ఈ క్రమంలో అత్యవసర వినియోగం కోసం రానున్న వారాల్లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపింది.

దీంతో అమెరికా మార్కెట్లో కంపెనీ షేర్లు భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి. నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్‌ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సహకారంతో రెండు మోతాదుల వ్యాక్సిన్‌ను మోడెర్నా రూపొందిస్తోంది. కోవిడ్‌-19 వ్యాక్సిన్ అభివృద్ధిలో ఇది కీలకమైన క్షణమని మోడెర్నా సీఈఓ స్టీఫేన్ బాన్సెల్ ఒక ప్రకటనలో తెలిపారు. మూడవ దశ ట్రయల్స్‌ లో తీవ్రమైన వ్యాధితో సహా, వ్యాధి నివారణకు సంబంధించి తొలి క్లినికల్ ఈ సానుకూల మధ్యంతర ధ్రువీకరణ అని పేర్కొన్నారు. కరోనా టీకా అందుబాటులోకి వచ్చిందనే అంశం అద్భుతమైన అనుభూతి అని చెప్పారు. ప్రతి రోజు ముఖ్యమైనదని తెలుసు.. జనవరి ఆరంభం నుండి, ప్రపంచ వ్యాప్తంగా వీలైనంత ఎక్కువమందిని రక్షించాలనే ఉద్దేశ్యంతో వ్యాక్సిన్‌ అభివృద్ధికి తీవ్రంగా కృషి చేశామన్నారు.

Tags:    

Similar News