ఏఐ యుగంలో రాతి యుగం మాటలా?!

Update: 2026-04-08 05:39 GMT

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్ లో రాతియుగం గురించి మాట్లాడిన అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో ఎవరూ ఊహించని రీతిలో వెనక్కి తగ్గారు. ఒక్క రాత్రిలోనే ఇరాన్ నాగరికత నామరూపాలు లేకుండా పోతుంది అని హెచ్చరించిన ఆయన చివరి నిమిషంలో కాల్పుల విరమణ ప్రకటించారు. అయితే ఇది రెండు వైపుల నుంచి ఉంటుంది అని స్పష్టం చేశారు. ఇరాన్ కు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు ముగియకముందే ఖర్గ్ ఐలాండ్ తో పాటు ఇరాన్ లోని రైల్వే నెట్ వర్క్ లపై ఇజ్రాయెల్ మంగళవారం నాడు పెద్ద ఎత్తున దాడులు చేసిన సంగతి తెల్సిందే. హర్ముజ్ జల సంధి తెరవకపోతే ఇక అంతే అంటూ హెచ్చరించిన ట్రంప్ చివరి నిమిషంలో పాకిస్థాన్ ప్రెసిడెంట్ షెహబాజ్ షరీఫ్ తో పాటు ఆర్మీ చీఫ్ అసీం మునీర్ నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ఇరాన్ కు రెండు వారాల గడువు ఇస్తున్నట్లు తెలిపారు. దేశాలు అన్నీ కూడా కాల్పుల విరమణ అమలు చేస్తాయని...అదే సమయంలో ఇరాన్ కూడా హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయటానికి అంగీకరించింది అనే ప్రకటన వెలువడింది.

                                   తాత్కాలికంగా అయినా సరే భీకర యుద్దానికి బ్రేకులు పడటంతో ప్రపంచం అంతా ఊపిరి పీల్చుకుంది అనే చెప్పాలి. ఈ రెండు వారాల్లో ఖచ్ఛితంగా ఒక పరిష్కారం దొరుకుంది అని...శాశ్వత శాంతికి మార్గం సుగమం అయినట్లే అన్న అభిప్రాయం ఎక్కువ మంది నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఇరాన్ అమెరికా ముందు పెట్టిన పది షరతులకు ఆ దేశం సూత్రప్రాయంగా ఇప్పటికే ఓకే చెప్పటంతో రాబోయే రోజుల్లో జరిగే చర్చల్లో ఇది ఒక కొలిక్కి రావటం ఖాయం అనే చర్చ సాగుతోంది. ఇరాన్ పై ఆంక్షలు తొలగించటంతో పాటు హర్ముజ్ జలసంధిపై హక్కులు ఇవ్వటం...అక్కడ వసూలు చేసుకునే టోల్ ను తమ దేశ పునర్నిర్మాణానికి ఉపయోగిస్తామని ఇరాన్ ప్రతిపాదించింది. దీనికి కూడా ట్రంప్ ఓకే చెప్పినట్లు సమాచారం.

                                     Full Viewఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే ఈ యుద్దానికి ముందే హర్ముజ్ జలసంధి నుంచి నౌకలు అన్నీ ఉచితంగానే వెళ్ళేవి. కానీ డోనాల్డ్ ట్రంప్ చేసిన యుద్ధం కారణంగా ఈ మార్గం గుండా ప్రయాణించే వివిధ దేశాలకు చెందిన నౌకలు అన్నీ కోట్ల రూపాయల్లో టోల్ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగినా కూడా ఇది యుద్దానికి ముగింపు కాదు అని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ సంచలన ప్రకటన చేశారు. తమ వేళ్ళు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉన్నాయని తెలిపారు. శత్రు దేశాలు ఏ విధమైన దురాక్రమణకు పాల్పడినా కూడా తాము పూర్తి బలంతో ధీటుగా స్పందిస్తామని ప్రకటించారు. తక్షణమే కాల్పులకు విరమణ ప్రకటించాలని అన్ని విభాగాలను ఆదేశించినట్లు వెల్లడించారు. కాల్పుల విరమణ ముందు తెరమీదకు వచ్చిన పది డిమాండ్లపై అమెరికా-ఇరాన్ లు గురువారం నాడే చర్చలు ప్రారంభించే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. మరో వైపు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు కూడా ఫుల్ జోష్ లో కొనసాగుతున్నాయి. చమురు ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. 

Tags:    

Similar News