మ‌న‌కూ ఓ మాల్దీవులు

Update: 2021-08-03 09:25 GMT

అభివృద్ధి చేయాలే కానీ దేశంలో ఎన్నో అద్భుత‌మైన ప్ర‌దేశాలు ఉన్నాయి. విదేశాల‌తో పోలిస్తే భార‌త్ లో పర్యాట‌కంపై ఫోక‌స్ త‌క్కువే. లక్ష్యాలు అయితే ఘ‌నంగా ఉంటున్నాయి కానీ..అమ‌లు విష‌యంలో మాత్రం అంతంతే. ఇప్పుడు కేంద్రం ఓ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. భార‌త్ లోనూ మాల్దీవుల త‌ర‌హా సౌక‌ర్యాలు అందుబాటులోకి తేవాల‌ని త‌ల‌పెట్టింది. దీనికి లక్షద్వీప్ కేంద్రంగా మార‌బోతుంది. లక్షద్వీప్ దేశంలోని ఓ కేంద్ర పాలిత ప్రాంతం అన్న విష‌యం తెలిసిందే.ఇక్క‌డ 800 కోట్ల రూపాయ‌ల అంచ‌నా వ్య‌యంతో అచ్చం మాల్దీవుల త‌ర‌హాలోనే నీటి విల్లాలు డెవ‌ల‌ప్ చేయ‌బోతున్నారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే గ్లోబ‌ల్ టెండ‌ర్లు పిలిచారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని కోణాల్లోనూ స‌మ‌గ్ర అధ్య‌య‌నం త‌ర్వాతే నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇవి పూర్తి అయితే దేశంలోని సంప‌న్న‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప‌ర్యాట‌కుల‌ను ఈ ప్రాంతం విశేషంగా ఆక‌ట్టుకునే అవ‌కాశం ఉంద‌నే అంచనాలు ఉన్నాయి. లక్షద్వీప్ లోని మూడు ప్రాంతాల‌ను ఈ త‌ర‌హా విల్లాల ఏర్పాటుకు ఎంపిక చేశారు. అందులో మినీకాయ్, క‌ద్ మ‌త్, సుహేలి దీవులు ఉన్నాయి. నీతి అయోగ్ సిఫార‌సుల మేర‌కు స‌ముద్ర‌తీర ప్రాంతాల ద్వారా అద‌న‌పు ఆదాయ వ‌న‌రులు స‌మ‌కూర్చుకోవాల‌న్న ప్ర‌తిపాద‌న‌లో భాగంగా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.అయితే కొత్త ప్రాజెక్టుల కార‌ణంగా ప‌ర్యావ‌ర‌ణానికి ఎలాంంటి న‌ష్టం చేయ‌కుండా చూడ‌టంతో పాటు స్థానికుల ఉపాధి అవ‌కాశాలు పెంచ‌టంతో..దేశంలోమ‌రింత మెరుగైన ప‌ర్యాట‌క వ‌స‌తులు అందుబాటులోకి తేవాల‌నే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.

Tags:    

Similar News