దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. రెండవ దశ కేసులు ఇక్కడ అత్యంత వేగంగా పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. కేంద్రం కూడా మహారాష్ట్రకు ప్రత్యేక బృందాన్ని పంపాలని నిర్ణయించింది. ఆదివారం నాడు ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర సర్కారు కూడా పలు చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా రాత్రివేళ్లలో, వారాంతాల్లో లాక్ డౌన్ అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి స్థాయి లాక్ డౌన్ కాకుండా నైట్ కర్ఫ్యూతో పాటు వారాంతపు లాక్‌డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
శుక్రవారం నుంచి సోమవారం ఉదయం వరకూ ఈ కర్ఫ్యూ కొనసాగుతుంది. అలాగే హోటళ్లలో, రెస్టారెంట్లలో కూర్చోని తినడాన్ని నిషేధించారు. పార్సిల్ సర్వీసు మాత్రం కొనసాగనుంది. అలాగే పార్కులు, సినిమా థియేటర్లను పూర్తిగా మూసేయనున్నారు. ఇక సినిమా షూటింగ్‌లను కూడా నిలిపేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ కూడా సోమవారం రాత్రి 8 గంటల నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అత్యవసర సర్వీసుల్లో ఉన్నవారికి మాత్రమే రాత్రి బయటకు రావడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది.