లాక్ డౌన్ అనివార్యమా?. లేకపోతే మరింత భయానక పరిస్థితులు రాబోతున్నాయా?. ఈ నిపుణుల సూచనలను మోడీ సర్కారు పట్టించుకుంటుందా?. రాష్ట్రాలకే లాక్ డౌన్ ల బాధ్యతలు వదిలేస్తే సరిపోతుందా?. లాక్ డౌన్ లు పెడితే ఆదాయం పోతుంది అని స్వయంగా ప్రభుత్వంలోని పెద్దలు చెబుతున్న తరుణంలో మరింత ప్రమాదంగా మారనున్న కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ఇప్పటికైనా కేంద్రం రంగంలోకి దిగుతుందా అన్న సందేహం ప్రజల్లో నెలకొంది. అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు, ప్రెసిడెంట్ జో బైడెన్ సలహాదారు అయిన అంటోనీ పౌచీ భారత్ లోకరోనా నియంత్రణకు కనీసం పదిహేను రోజులు అయినా కఠిన లాక్ డౌన్ విధించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇప్పుడు ఎయిమ్స్ చీఫ్, డాక్టర్ గులేరియా కూడా లాక్ డౌన్ అనివార్యం అంటూనే సంచలన వ్యాఖ్యలు చేయటం కలకలం రేపుతోంది. పరిస్థితిని ఇలాగే వదిలేస్తే మరింత విలయం తప్పదని గులేరియా హెచ్చరించారు. రాత్రి కర్ఫ్యూలు, వారాంతపు లాక్ డౌన్ ల వల్ల పెద్దగా ఉపయోగం లేదని.. గతేడాది మార్చిలో విధించిన తరహాలో కఠిన లాక్‌డౌన్ చాలా అవసరమన్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా, తెలంగాణ వంటి రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్ విధిస్తున్నా... ప్రభావం చూపలేకపోతున్నాయనే విషయం స్పష్టమవుతోందన్నారు.
వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోందన్నారు. ఇప్పటికే దేశంలో వైద్య సదుపాయాల కొరత ఏర్పడుతోందని.. దిల్లీలోని బాత్రా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 12 మంది మరణించడం, అందులో ఓ వైద్యుడు ఉండటం అత్యంత బాధాకరమని గులేరియా విచారం వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో ఆరోగ్య సదుపాయాలతో పాటు సిబ్బంది కూడా తగ్గిపోతున్నారని.. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా లేకపోతే పరిస్థితులు చేయిదాటిపోతాయని ఆయన హెచ్చరించారు. 'ఆసుపత్రుల్లో రోగులు పెరిగిపోతుండటంతో వైద్యులు, సిబ్బందిపై ఒత్తిడి పెరిగిపోతోంది. ప్రపంచంలోని ఏ ఆరోగ్య వ్యవస్థ కూడా ఈ తరహా పనిభారాన్ని మోయదు. కేసులను తగ్గించేందుకు కఠిన లాక్‌డౌన్ విధించడం లేదా ఇంకేదైనా మార్గముంటే అమల్లోకి తీసుకురావాలి' అని సూచించారు.