ఈ చర్యలు చాలవు..లాక్ డౌన్ ఒక్కటే మార్గం

Update: 2021-05-04 12:59 GMT

రాత్రి కర్ఫ్యూలు..వీకెండ్ లాక్ డౌన్లు ఏ మాత్రం సరిపోవని..పూర్తి స్థాయి లాక్ డౌన్ ఒక్కటే దేశంలో కరోనా రెండవ వేవ్ ను అరికట్టడానికి మార్గం అని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా మరోసారి తేల్చిచెప్పారు.. ఆయన గత కొన్ని రోజలుగా ఇదే మాట పదే పదే చెబుతున్నారు. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గులేరియాతోపాటు అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ పౌచీ కూడా భారత్ వెంటనే లాక్ డౌన్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత కట్టడి చర్యలు కరోనాను ఏమాత్రం నియంత్రించటంలేదని హెచ్చరించారు. కరోనా మూడో వేవ్‌కు సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేశారు. మంగళవారం ఓ జాతీయ మీడియాతో గులేరియా మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడికి మూడు మార్గాలు ఆయన సూచించారు. వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయటం ద్వారా మూడవ దశ ముప్పును ఎదుర్కోవచ్చన్నారు. అదే సమయంలో ఆస్పత్రుల్లో మౌలికసదుపాయాలను పెంచుకోవాలని, ప్రజలు ఒకే చోట గుమిగూడకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ చర్యలు తీసుకుంటేనే కేసులు తగ్గేందుకు ఆస్కారం ఉందని డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు. కొన్ని ప్రాంతాలకే లాక్‌డౌన్‌ పరిమితమైతే అమెరికా మాదిరి మన దేశంలో పరిస్థితి ఉంటుంది. లాక్‌డౌన్‌ లాంటి నిర్ణయం తీసుకుంటూనే ప్రజలకు నిత్యావసరాలతో పాటు రోజువారీ కార్మికుల గురించి కూడా ఆలోచన చేయాలి. నిర్ణీత కాలం పాటు లాక్‌డౌన్‌ విధించాలి. కనీసం రెండు వారాలైనా సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించాలి అని ఆయన సూచించారు. కానీ కేంద్రం మాత్రం దేశ వ్యాప్త లాక్ డౌన్ కు ఛాన్స్ లేదంటూ భారం మొత్తం రాష్ట్రాలపైనే పెట్టేస్తోంది. వైద్య రంగంలోని నిపుణులు పదే పదే లాక్ డౌన్ గురించి ప్రస్తావిస్తున్నా కేంద్రం మాత్రం ఈ విషయంలో పెద్దగా ఫోకస్ పెడుతున్న దాఖలాలు కన్పించటం లేదు.

Tags:    

Similar News