జీవిత బీమా సంస్థ‌ ...ఇన్వెస్ట‌ర్ల‌కు ఏది ధీమా

Update: 2022-06-06 11:48 GMT

Full Viewభారీ ఐపీవోలు అన్నీ ఎందుకో బోల్తా కొడుతున్నాయి. మొన్న పేటీఎం..ఇప్పుడు ఎల్ ఐసీ. ఎల్ఐసీ ఐపీవోకు వ‌చ్చిన హైప్ అంతా ఇంతా కాదు. అస‌లు ఎల్ఐసీ ఐపీవోకు ద‌ర‌ఖాస్తు చేయ‌క‌పోతే వారు భారీగా న‌ష్ట‌పోతారు అన్న త‌ర‌హాలో ప్ర‌చారం సాగింది. ఎల్ ఐసీ కూడా అదే స్థాయిలో ప్ర‌చారం చేసింది. కానీ ఐపీవో పూర్త‌యిన త‌ర్వాత సీన్ రివ‌ర్స్ అయింది. లిస్టింగ్ ద‌గ్గ‌ర నుంచి ఇప్పటి వ‌ర‌కూ ఒక్కసారి కూడా ఇంత వ‌ర‌కూ ఆఫ‌ర్ ధ‌ర‌ను ఈ షేర్లు అందుకోలేదు. సామాన్య ఇన్వెస్ట‌ర్ల‌కు ఎల్ఐసీ 949 రూపాయ‌ల‌తో షేర్ల‌ను జారీ చేసింది. పాల‌సీదారుల‌కు..ఉద్యోగుల‌కు కొంత రాయితీ ఇచ్చినా కూడా సామాన్య ఇన్వెస‌ర్ట‌కు మాత్రం 949 రూపాయ‌ల‌కు షేర్లు కేటాయించారు. లిస్టింగ్ రోజే ఎనిమిది శాతం న‌ష్టంతో నమోదు అయ్యాయి. ఇప్పుడు ఆ న‌ష్టం మ‌రింత పెరిగింది. సోమ‌వారం నాడు ఎల్ ఐసీ షేర్లు మార్కెట్ ప్రారంభంలోనే కొత్త క‌నిష్ట స్థాయికి చేరాయి.

ఎల్ ఐసీ ఐపీవో ద్వారా 20,557 కోట్ల రూపాయ‌లు స‌మీక‌రించిన విష‌యం తెలిసిందే. ఆఫ‌ర్ ధ‌ర 949 రూపాయ‌ల‌తో పోలిస్తే సోమ‌వారం నాడు మొత్తం మీద క‌లిపి ఈ షేర్లు 174 రూపాయ‌ల మేర త‌గ్గి 775 రూపాయ‌ల క‌నిష్ట స్థాయికి ప‌త‌నం అయ్యాయి. చివ‌ర‌కు బీఎస్ఈలో 777 రూపాయ‌ల వ‌ద్ద ముగిశాయి. ఎల్ ఐసీ షేర్ల తీరును చూసి జీవిత బీమా సంస్థ‌..ఇన్వెస్ట‌ర్లు త‌మ‌కు దీమా ఏది అంటున్నారు. ఎల్ ఐసీ ఇష్యూకు ముందు పెద్ద దుమార‌మే రేగింది. అది ఏంటి అంటే ఎల్ ఐసి అస‌లు విలువ (ఎంబెడెడ్ వాల్యూ)ను త‌గ్గించి చూపార‌ని..ఇది ప్రైవేట్ పెట్టుబ‌డిదారుల‌కు మేలు చేసేందుకే అన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయితే ఇందులో నిజ‌నిజాల సంగ‌తి ప‌క్క‌న పెడితే ఈ ధ‌ర‌కు కూడా ఎల్ ఐసీ షేర్లు మార్కెట్లో నిల‌దొక్కులేక‌పోవ‌టం ఇన్వెస్ట‌ర్ల‌ను నిరాశ‌కు గురిచేస్తోంది. తాజా ప‌త‌నంలో ఎల్ ఐసీ మార్కెట్ క్యాపిటలైజేష‌న్ ఐదు ల‌క్షల కోట్ల రూపాయ‌ల‌కు ప‌త‌నం అయింది.

Tags:    

Similar News